చేసిన రెండు సినిమాలతోనే తెగ పాపులర్ అయిపోయింది సాయి పల్లవి. తెలుగులో ఆమె క్రేజ్ అలా ఇలా లేదిప్పుడు. అయితే ఆమధ్య నాగశౌర్య మాత్రం సాయి పల్లవిపై కౌంటర్లు వేశాడు. సెట్లో తన డామినేషన్ ఎక్కువ ఉంటుందని, తన ముందు మిగిలిన పాత్రలేవీ ఫోకస్ అవ్వడానికి ఇష్టపడదని – సూటిగా చెప్పేశాడు. ఆ విషయంపై సాయి పల్లవి మాట్లాడింది. నాగశౌర్యతో తనకసలు గొడవలే లేవని, సెట్లో అడుగుపెడితే తన పాత్ర గురించి ఏమీ ఆలోచించనని, బహుశా.. దాంతోనే తనని శౌర్య తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అంటోంది. ”నాగ శౌర్య నా గురించి చెప్పిన వీడియో చూసి షాకయ్యా. ఆ వెంటనే తనకు ఫోన్ చేశా. కానీ అందుబాటులోకి రాలేదు. శౌర్య చాలా మంచి నటుడు. చాలా కామ్‌గా ఉంటాడు. ఇలా ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. నాకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. సెట్లోకి వెళ్తే నా పాత్ర గురించి దర్శకుడితో ఒకటికి పది సార్లు చర్చిస్తా. అది శౌర్యని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. శౌర్యతోనే కాదు, నాకు ఎవరితోనూ గొడవలు లేవు” అంది. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘కణం’ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇందులో సాయి పల్లవి తల్లి పాత్రలో కనిపించనుంది.
”తల్లి పాత్ర ఒప్పుకునే ముందు కాస్త టెన్షన్ పడ్డాను. ఇప్పటికీ నాకు నేను చిన్న పిల్లగానే కనిపిస్తా. అలాంటిది ఆ పాత్ర చేయగలనా? అనిపించింది. కానీ ఈ స్క్రిప్టు మా అమ్మకి తెగ నచ్చేసింది. ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకు అని చెప్పింది. కథ మొత్తం విన్న తరవాత.. నాకూ అదే ఫీలింగ్ కలిగింది. అందుకే కణం సినిమా ఒప్పుకున్నా” అంది. ప్రస్తుతం శర్వానంద్‌తో కలసి ఓసినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. తమిళంలో సూర్యతో కలసి ఓ సినిమా చేస్తోంది.