సోషల్ మీడియాలో అసభ్య రాతలకు గాను పొలిటికల్పంచ్ రవి కిరణ్‌ను అరెస్టు చేయడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సందర్భంలో అందరి ఖండనలూ ఒకటేనని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ కార్టూనులు బాగాలేవు గనక అరెస్టు చేయొచ్చని టిడిపి అభిమానులు ఏకపక్షంగా సమర్థించారు. వైఎస్ఆర్సిపి అభిమానులేమే ఏకపక్షంగా ఖండించారు. అయితే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పనిచేస్తున్న సంస్థల తీరు వేరు. భావ ప్రకటనా స్వేచ్చపై దాడిని ఖండిస్తూనే కంటెంట్ విషయంలో ప్రమాణాలు పాటించాలని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి స్పందన కొంచెం ఆసక్తికరంగా వుంది. నెట్లో అందుబాటులో వుంచిన ఆయన క్లిప్పింగులలో చూస్తే ఆయన పోలీసులతో తీవ్రంగానే వాదించారు. అయితే అవతలివారు వాదించలేదు గనక కోపంగా తన విమర్శలు వినిపించారని చెప్పడం సమంజసంగా వుంటుంది. మొదటి విషయం సోషల్ మీడియా సైట్ తమ పార్టీకి చెందిందనే విషయం తాము కాదనడం లేదని ఆయన అన్నారు. చట్టబద్దంగా ఏ చర్యయినా తీసుకోవచ్చని దానికి తాము స్వాగతం పలికి సహకరిస్తామని ప్రకటించారు. అదే సమయంలో లోకేష్ ను అసమర్థుడు, పప్పు అని తాను కూడా అంటున్నానని ఏం చేస్తారో చేసుకోవచ్చని సవాళ్లు విసిరారు.విశాఖ పట్టణం విమానాశ్రయంలో అరెస్టు ఘటనను కూడా ప్రస్తావించారు. అయితే పోలీసు అధికారులు ఆయనతో ఘర్షణకు గాని వాదనకు గాని అవకాశమిచ్చినట్టు కనిపించదు. అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు గనక అధికారికంగా స్పందించినట్టు భావించాల్సి వుంటుంది. ఏమైనా ఈ ఘటన తర్వాత తన బెదిరింపు వైఖరిని ప్రభుత్వం విరమించుకుంటే మంచిది. ఇక వైసీపీ తరపున రాసేవారు కూడా విమర్శలు వ్యంగ్యాల పరిమితులు గమనంలో వుంచుకోవాలి. సాయిరెడ్డి చర్య బహుశా తన వారికి భరోసా కలిగించేందుకు ఉద్దేశించి వుండొచ్చు.