బెల్లంకొండ శ్రీనివాస్ని హిందీ శాటిలైట్ లో అనూహ్యమైన మార్కెట్ ఉంది. ఇక్కడ ఫ్లాప్ అయిన అతని సినిమాలు సైతం.. హిందీ డబ్బింగ్ లో దుమ్ము రేపే వ్యూస్ సంపాదించుకుంటాయి. అక్కడ టీవీలో సౌత్ ఇండియన్ డబ్బింగులు చూసేవాళ్లకు.. బెల్లం కొండ సుపరిచితమైన హీరోనే. ఎప్పటి నుంచో ఓ హిందీ సినిమా చేయాలని కలలు కంటూ వస్తున్నాడు. ఇప్పుడు అతని కలలు నిజమయ్యాయి. `ఛత్రపతి` రూపంలో.
తెలుగునాట రాజమౌళి – ప్రభాస్ సృష్టించిన మాస్ ధమాకా.. ఛత్రపతి. ఇందులోని యాక్షన్,ఎమోషన్ మాస్ కి నచ్చేస్తే, సెంటిమెంట్ కుటుం ప్రేక్షకుల్ని కదిలించింది. అందుకే ఛత్రపతి ప్రభాస్కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచింది. ఇన్నాళ్లకు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చింది. దానికి బెల్లంకొండ నే సరైన హీరో అనిపించింది. ఇప్పటికే ఈ సినిమా హిందీ రైట్స్ ని ఓ బాలీవుడ్ నిర్మాత సొంతం చేసేసుకున్నాడు. మంచి దర్శకుడ్ని పట్టి, బెల్లంకొండ తో ఈ సినిమా చేయించాలని చూస్తున్నారు. అయితే.. `ఛత్రపతి` కూడా హిందీ డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంది. ‘హుకూమత్ కీ జంగ్’ పేరుతో హిందీ వెర్షన్ అందుబాటులోకి వెళ్లింది. ఇప్పటికే అక్కడి మాస్ ప్రేక్షకులు టీవీ ఛానళ్లలోనూ, యూ ట్యూబ్లోనూ చాలాసార్లు చూసేశారు. పైగా ఛత్రపతి వచ్చి చాలా కాలం అయ్యింది. ఈలోగా ప్రేక్షకుల అభిరుచులు మారిపోయి ఉంటాయి. ఇంత ఆలస్యంగా ఈ సినిమాని రీమేక్ చేయడం ఇబ్బందికరమైన విషయమే. మాతృకలో భారీ మార్పులు చేసుకుంటే తప్ప, బాలీవుడ్ ని అలరించడం అంత తేలికైన విషయం కాదు. పైగా ఈ కథని హ్యాండిల్ చేసే దర్శకుడు దొరకాలి. సౌత్ ఇండియన్ పల్స్ తెలిసి, దానికి తగ్గట్టుగా బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్న దర్శకుడి అవసరం ఉంది.