రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి ఈ ఉదయం డిశ్చార్డ్ అయి ఇంటికి వెళ్లారు. అయితే ఆయనకు మరి కొంత కాలం ఫిజియోధెరపి సేవలు అవసరం అని.. అందు వల్ల .. మరో నెల రోజుల వరకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల తర్వాతే మళ్లీ ఆయన షూటింగ్లకు హాజరవుతారు. తాను కోలుకుంటున్నానని ఈ నెల మూడో తేదీన సాయి ధరమ్ ట్వీట్ చేశారు. ధంబ్ చూపిస్తున్న ఫోటోనూ కూడా పోస్ట్ చేశారు.
సెప్టెంబర్ 10వ తేదీన సాయి ధరమ్ తేజా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపైన ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారు. విడుదలకు సిద్ధంగా ఉన్న తన రిపబ్లిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడేందుకు దర్శకుడు దేవా కట్టా ఇంటికి వెళ్తూండగా ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అపోలోకు తరలించారు. అప్పట్నుంచి గత 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
సాయి ధరమ్ పరిమిత వేగంతోనే వెళ్తూండటంతో శరీరానికి బహిరంగంగా పెద్ద గాయాలు తగల్లేదు. కానీ కొన్ని అంతర్గత గాయాలు కావడంతో కొద్ది రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. కోలుకున్నతర్వాత ఆయనకు ఫిజియో థెరపీ చేయిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు.