సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై.. టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి అనే ఎన్నారై పోటీ చేస్తున్నారు. ఆయన హుజూర్ నగర్లోనే పుట్టారు. కానీ… తన జీవిత కాలంలో ఎక్కువగా కెనడాలోనే ఉన్నారు. అక్కడే ఉద్యోగమో.. వ్యాపారమో చేసుకుంటూ గడిపారు. కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలపై మనసు పుట్టింది. జగదీష్ రెడ్డితో సాన్నిహిత్యం కూడా కలసి రావడంతో.. హుజూర్ నగర్‌కు మకాం మార్చారు. అక్కడ టీఆర్ఎస్కు నాయకురాలిగా… తెలంగాణ కోసం బలిదానం చేసిన.. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఉన్నారు. ఆమెను పక్కన నెట్టేసి.. సైదిరెడ్డికి.. టిక్కెట్ ఇప్పించారు జగదీశ్వర్ రెడ్డి. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ విషయంలో… ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంపిక చేసి.. ఆ చుట్టుపక్క అప్పటికే భూములు కొన్న సైదిరెడ్డి.. వందల కోట్ల లాభం చేకూర్చి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే..అసలు ఈ సైదిరెడ్డి..ఇండియన్ సిటిజన్ కాదనే వాదన బయలుదేరింది.
శానంపూడి సైదిరెడ్డి చాలా కాలం విదేశాల్లో ఉన్నారు. కెనడా పౌరసత్వం తీసుకున్నారు. అక్కడి పాస్ పోర్టు కూడా… తీసుకున్నారు. అంటే.. భారత పౌరసత్వం వదులుకున్నట్లే. అయితే.. ద్వంద్వ పౌరసత్వం తీసుకునే అవకాశం భారతీయులకు ఉంది. 2004 నుంచి భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే.. విదేశీ పౌరసత్వం తీసుకున్నా.. వారికి భారతీయులుగా గుర్తింపు ఉంటుంది. ఈ అవకాశాన్ని సైదిరెడ్డి ఉపయోగించుకుని కెనడా పౌరసత్వం తీసుకున్నారు. కానీ.. ఇక్కడో మెలిక ఉంది. ఇలా ద్వంద్వ పౌరసత్వాన్ని ఉపయోగించుకుని.. విదేశీ పౌరునిగా మారిన వారికి.. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మాత్రం ఉండదు. ఈ విషయాన్ని సైదిరెడ్డి దాచి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. సైదిరెడ్డికి చెందిన ఓ పాస్ పోర్ట్ ఫోటోకాపి ఇప్పుడు విస్త్రృతంగా ప్రచారం అవుతోంది.
ఇలాంటి పరిస్థితి టీఆర్ఎస్లోనే మరో ఎమ్మెల్యేకు ఉంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ … జర్మనీ పౌరుడు. ఆయన ఆ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పినా.. రకరకాల పిటిషన్లు వేసి ఎప్పటికప్పుడు స్టే తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితమే ఆయనపై అనర్హాత వేటు పడబోతోందని.. ప్రచారం జరిగింది. కానీ.. స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు..మళ్లీ పోటీ చేస్తున్నారు. వచ్చే నెలలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన పౌరసత్వంపై … నిర్ణయం వెలువడనుంది. ఈ లోపు ఆయనకు తోడుగా.. సైదిరెడ్డి కూడా తోడవుతున్నారు. పొరపాటున సైదిరెడ్డి గెలిచినా ఏమీ కాదు..ఎందుకంటే.. పౌరసత్వం పై ఎలాంటి నిర్ణయాలు వచ్చినా.. కావాల్సినంత కాలం.. దాన్ని వాయిదా వేసుకుంటూ పోయే వెసులుబాటు మనదేశంలో ఉంది మరి..!