రీల్ లైఫ్ నాయికా నాయకులే రియల్ లైఫ్ భార్యాభర్తలైతే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అలా చాలా జంటలే ఉన్నాయి. తెరమీద కూడా హీరో హీరోయిన్లుగా నటించి, డ్యూయెట్లు పాడి ఆనందించి అలరించిన జంటలు కూడా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కు ఇదివరకే పెళ్లయినా, ఏరికోరి వరించింది అందాల భామ కరీనా కపూర్. వయసులో భారీ తేడా ఉన్నా మనసుపడి మనువాడింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అవి బాక్సాఫీసు దగ్గర ఏమయ్యాయని మాత్రం అడగవద్దు.
రియల్ లైఫ్ భార్యాభర్తలు తెరమీద గొప్పగా కనించాలని రూలేం లేదంటున్నాడు సైఫ్ అలీఖాన్. కథ, కథనాన్ని బట్టి, పాత్రల్లోని బలాన్ని బట్టి ఆ జంట మధ్య కెమెస్ట్రీ కుదరడం, కుదరక పోవడం ఆధారాపడి ఉంటుందట. కథ బాగుంటే ఆ జంట కన్నుల పంటగా కనిపిస్తుందట. ఇవన్నీ కాదుగానీ, ఇంట్లోని ఇల్లాలే షూటింగులో, డ్యూయెట్లలో జోడీ అయితే అందులో చెప్పుకోదగ్గ విషయం ఏముందీ అంటున్నాడు. తెరమీద జో్డీగా మరో అమ్మాయి అయితేనే కెమిస్ట్రీ బాగా కుదురుతుందట. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటూ కొత్త సిలబస్ చెప్తున్న సైఫ్ అలీఖాన్ ను సంగతేంటని బేగం కరీనా కపూర్ ఇంట్లో నిలదీయదు కదా? ఆ గొడవేదో వాళ్లిద్దరూ చూసుకుంటారు, మనకెందుకు!