ఆదివారం హడావుడిగా నాగచైతన్య సినిమా నిర్మాణ సంస్థ ఓ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వంలో చైతన్య హీరోగా నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ వారం రోజుల్లో విడుదల చేస్తామని, ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నదని ఫేక్ లుక్ అనీ!
నితిన్ హీరోగా త్వరలో సినిమాలో చేయనున్న వెంకీ కుడుములు ఈ రోజు ఒక ట్వీట్ చేశారు. “ప్లీజ్… మేం వచ్చేవరకూ సహనంతో ఎదురు చూడండి. ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా. పుకార్లను నమ్మవద్దు. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోన్న లోగో ఫేక్. ప్రతి విషయాన్నీ త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం” అని వెంకీ కుడుములు ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఛలో’తో దర్శకుడిగా పరిచయమైన ఈ యువకుడు, వెంటనే నితిన్ హీరోగా సినిమా చేయడానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భీష్మ’ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే పేరుతో లోగో డిజైన్ చేసి నెట్టింట్లో వదిలారు. అది కాస్తా కాసేపు ట్రెండ్ అయ్యింది. వెంటనే దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
రెండు రోజుల్లో రెండు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయా సినిమాలకు చెందిన సభ్యులు వివరణ ఇచ్చారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే… రెండు సినిమాలకూ నిర్మాత ఒక్కరే. సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మాతగా రూపొందుతోన్న సినిమాలు ఇవి. త్రివిక్రమ్ దర్శకుడిగా వరుస సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సంస్థకు అనుబంధ సంస్థ ఇది. తమ సినిమాలో హీరో లుక్కు, తమ సినిమా లోగో ఒక్కొక్కటిగా వస్తుంటే ఫేక్ అని స్పష్టం చేస్తున్నారు. ‘సితార…’లో సినిమాలకు మాత్రమే ఎందుకిలా జరుగుతోందో? నిర్మాతలే కావాలని ఈ విధంగా చేస్తున్నారని ఓ పక్క విమర్శలు వస్తున్నాయి. అందుకని జాగ్రత్త పడితే మంచిది.