ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కడే ఎంతగా చెమటోడ్చుతున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు పైగా నెలకొకరు చొప్పున పార్టీని వీడి వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. త్వరలో మాజీ మంత్రి ఎస్.శైలజానాద్ పార్టీని వీడి వైకాపాలోకి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తెదేపాలోకి వెళదామని ప్రయత్నించారు కానీ వీలుపడకపోవడంతో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి సుమారు ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడకపోవడంతో శైలజనాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో అటువంటి బలమయిన నాయకుడి కోసం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయనను వైకాపాలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా ముగ్గురు కాంగ్రెస్ నేతలు వైకాపాలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో మధ్యవర్తుల ద్వారా చర్చలు చేస్తున్నట్లు సమాచారం.