ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక రోజు ముందే అత్యంత విలువైన పుట్టిన రోజు కానుక లభించింది. అది ఇచ్చింది ఎవరో కాదు, హైదరాబాదీ సంచలనం, ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ప్రధాని మోడీని సైనా ఢిల్లీలో కలిసింది. గురువారం పుట్టిన రోజు జరుపుకోబోతున్న మోడీకి ఓ విలువైన కానుక బహూకరించింది. ఆ బ్మాడ్మింటన్ రాకెట్. దానికి ఎందుకు అంత విలువ అంటే, వరల్డ్ బ్మాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో ఆ రాకెట్ లో ఆడి రజత పతకం సాధించింది. అందుకే అది అత్యంత విలువైన రాకెట్.
ప్రధానిని కలవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని సైనా చెప్పింది. ఆయనకు క్రీడల పట్ల ఆసక్తి ఉందని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పింది. తాను ఆడిన మ్యాచ్ ల గురించి ఆయన చర్చించారని, తన విజయాలకు అభినందనలు తెలిపారని వివరించింది. మోడీ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడం తనకు మధురానుభూతి అని సైనా సంబరపడిపోయింది. ఆయనకు అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని సైనా చెప్తోంది.