Saindhav Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్
వెంకటేష్…. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తున్న పేరు. కామెడీ, లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఏదైనా చేయగలిగే ఆల్ రౌండర్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకీ అంటే చాలా ఇష్టం. తన కెరీర్లో 75వ సినిమా చేస్తున్నాడంటే… సమ్ థింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అది సహజం. ‘సైంధవ్’ టీజర్, ట్రైలర్, పోస్టర్.. అన్నింట్లోనూ ఓ ఇంటెన్స్ కనిపించింది. ఎప్పుడూ లేనంత ఎగ్రిసివ్గా వెంకీని చూశాం. పైగా సంక్రాంతికి వస్తోంది. అందుకే ‘సైంధవ్’ అన్ని రూపాల్లోనూ అంచనాల్ని పెంచేశాడు. మరి వెంకీ మైల్ స్టోన్ సినిమా ఎలా ఉంది? రూ.17 కోట్ల ఇంజక్షన్.. అంటూ హడావుడి చేసిన ఈ సినిమాలో అంత ‘వర్త్’ ఉందా? లేదా?
సైంధవ్ (వెంకటేష్) షిప్ యార్డ్ లో డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్య లేదు. చిన్న పాప. పేరు గాయత్రి (సారా). తన పాపంటే సైంధవ్కి ప్రాణం. గాయత్రి కూడా నాన్నని ఓ సూపర్ హీరోలా చూస్తుంటుంది. అలాంటి గాయత్రికి ఓ ఖరీదైన జబ్బు సోకుతుంది. రూ.17 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే గానీ పాప బతకదు. అక్కడ్నుంచి సైంధవ్లోని ‘సైకో’ బయటకు వస్తాడు. పాపని బతికించుకోవడానికి సైంధవ్ తన పాత వృత్తిని మళ్లీ ఎంచుకొంటాడు. ఇంతకీ ‘సైంధవ్’లో ఉన్న ఆ ‘సైకో’ ఎవరు? అంత ఖరీదైన ఇంజక్షన్ ఎలా సంపాదించాడు? పాపని బతికించుకొన్నాడా, లేదా? అనేది మిగిలిన కథ.
‘సైంధవ్’ కథేమిటో తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిన అవసరం లేదు. ట్రైలర్ ప్లే చేస్తే చాలు. ఎందుకంటే ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు దర్శకుడు. నిజానికి ట్రైలర్లో కథంతా చెప్పేయడంలో ఓ సౌలభ్యం ఉంది. ఓ ఇబ్బందీ ఉంది. ప్లస్ ఏమిటంటే.. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా చూడబోతున్నామో ముందే చెప్పేసి ప్రిపేర్ చేయొచ్చు. వాళ్లకు కథపై ఎలాంటి కొత్త అంచనాలూ ఉండవు. కథ చెప్పడం వల్ల.. తెరపై ఇంకా ఏదో ఓ కొత్త ఎలిమెంట్ చూపించాలి. అది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలి. ‘ట్రైలర్లోనే ఇంత చెప్పాను. ఇక సినిమాలో ఎంత ఉంటుందో ఊహించుకోండి’ అని దర్శకుడు శైలేష్ కొలను కూడా కాస్త గట్టిగానే చెప్పాడు. కాబట్టి.. సినిమాలో అంతకు మించిన థ్రిల్ ఏదో ఉంటుందనుకోవడం సహజం కూడా. అయితే ఆ ఎలిమెంట్స్ వెండి తెరపై అంతగా కనిపించలేదు.
చంద్ర ప్రస్థానం అనే ఓ ఊహాజనిత ప్రాంతంలో జరిగే కథ ఇది. ఆ పేరేమిటో, ఆ ప్రాంతం ఏమిటో.. అంతా గందరగోళంగా ఉంటుంది. దొంగ నోట్లు, ఆయుధాలు, డ్రగ్స్ ఉన్న ఓ కంటైనర్ చంద్రప్రస్థానం షిప్ యార్డ్లో ఇరుక్కుంటుంది. ఆ కంటైనర్ కోసం వికాస్ (నవాజుద్దీన్ సిద్దీఖీ) ప్రయత్నిస్తుంటాడు. సైంధవ్ కేమో ఇంజక్షన్ కావాలి. ఈ రెండు కథలూ కలుస్తాయని ప్రేక్షకులకు ముందే తెలుసు. ట్రైలర్లోనూ అదే చెప్పారు. కాబట్టి… ఆ విషయం కూడా షాకింగ్ గానో, ఇంట్రస్టింగ్ గానో అనిపించదు. చాలా పాత్రల్ని, విషయాల్ని దర్శకుడు ‘హాఫ్ వే’లో ఓపెన్ చేశాడు. బహుశా.. పార్ట్ 2 కోసం దాచుకొన్నాడేమో.? ఈ యువ దర్శకులతో అదే చిక్కు. ఓ కథలో చెప్పాల్సిందంతా చెప్పకుండా పార్ట్ 2 కోసం పిసినారితనం చూపిస్తుంటారు. దాంతో అసలు కథలో గందరగోళం మొదలైపోతుంది. తొలి భాగం హిట్టయితేనే పార్ట్ 2 ఉంటుందన్న లాజిక్ ని వీళ్లంతా మిస్ అయిపోతున్నారు. ‘సైంధవ్’లోనూ అదే తప్పు జరిగింది.
మను పాత్రకీ సైంధవ్ కీ ఉన్న రిలేషన్ ఏమిటన్నది ప్రేక్షకులకు తెలీదు. ఆర్య క్యారెక్టర్ కూడా అంతే. ఆ పాత్ర స్వభావం అర్థం కాదు. అసలు `సైకో` ఎవరో తెలీదు. సైకోకీ, పాత గ్యాంగ్ కీ ఉన్న కనక్షన్ కొన్ని డైలాగుల్లో చెప్పారంతే. సినిమా అనేది విజువల్ మీడియా. చాలా విషయాలు విజువల్ గానే చెప్పాలి. డైలాగులకే పరిమితం చేస్తే ఇంపాక్ట్ రాదు. పాపకి వచ్చిన జబ్బు చాలా అరుదు అని చెబుతూనే, చంద్ర ప్రస్థానంలో అదే జబ్బుతో 350 మంది పిల్లలు బాధ పడుతున్నట్టు చూపించడం లాజిక్ కి దూరంగా ఉంటుంది. నిజానికి 17 కోట్ల ఇంజక్షన్ అంటేనే.. సామాన్య ప్రేక్షకుడు ఆ పాయింట్ తో డిస్కనక్ట్ అయిపోతాడు. అలాంటిది ఒక పాప కథ కాస్తా 35 మంది కథగా మారిపోయింది. ‘సార్.. ఈసారికి ఈ ఇంజక్షన్ మా పాపకు వాడతాను. మీకు తరవాత ఇస్తాను’ అని ఓ సెక్యురీటీ గార్డ్ తో డైలాగ్ చెప్పించారు. ఓ నాన్నగా సెక్యురిటీ గార్డ్ బాధ అర్థం చేసుకోదగినదే. అయితే ఇది రూ.17 కోట్ల ఇంజక్షన్. ‘ఓ పది వేలు ఉంటే సర్దండి. జీతం రాగానే ఇచ్చేస్తాను’ అన్నంత సింపుల్ గా ఈ డైలాగ్ చెప్పించడం చూస్తే దర్శకుడు కథపైనే కాదు, క్యారెక్టర్లపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది.
‘విక్రమ్’ ప్రభావం ఈ సినిమాపై కనిపిస్తుంది. విక్రమ్ స్టైల్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ని చేద్దామనుకొన్నాడు దర్శకుడు. కథగా విక్రమ్ సాదా సీదాగానే ఉంటుంది. కానీ అందులో హై మూమెంట్స్ కనిపిస్తాయి. `సైంధవ్`లో అదే పెద్ద లోటు. సెకండాఫ్లో.. పాపపై విలన్ గ్యాంగ్ దాడి చేసినప్పుడు ఓ కారు ఎంట్రీ ఇస్తుంది. ఆ ఎపిసోడ్ లో కాస్త హై ఉంటుంది. అలాంటి సీన్లు వీలైనన్ని ఎక్కువ పడాలి. కథలో ఎమోషన్ కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదే. తండ్రీ కూతుర్ల ట్రాక్ వాళ్లకు నచ్చుతుంది. పాపపై ఓ సింపతీ ఏర్పడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే.. దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమాని దూరం చేస్తుంది. యాక్షన్ డోసు ఎక్కువ.
75 సినిమాల అనుభవం ఉన్న వెంకీ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. తను ఎమోషన్ బాగా హ్యాండిల్ చేస్తాడు. ఈ సినిమాలో అందుకు ఇంకాస్త ఎక్కువ ఛాన్స్ ఉంది. పాపని కాపాడుకోవడానికి తపన పడే ఓ సాధారణ తండ్రిగా తన నటన బాగుంది. యాక్షన్ సీన్స్ లో.. చాలా ఎగ్రసీవ్గా, ఎనర్జిటిక్ గా కనిపించాడు. ‘ఆడవాళ్లపై చేయిచేసుకొన్నానన్న ట్రాక్ రికార్డ్ నాకు లేదు’ అన్న చోట విజిల్స్ పడతాయి. నవాజుద్దీన్ సిద్దీఖి చేసిన తొలి తెలుగు సినిమా ఇది. ఉన్నంతలో తన పాత్రే ఎంటర్టైన్ చేసింది. అయితే.. అంత మంచి నటుడితో సగటు విలన్ లా లౌడ్ యాక్టింగ్ చేయించడం నచ్చదు. తెలుగు నేర్చుకొని తెలుగులో డైలాగులు చెప్పాడంటూ కితాబులు ఇచ్చారు కానీ, ఇందులో హిందీ డైలాగులే ఎక్కువ. పైగా ప్రతీసారీ ఓ బూతు పదం నోటి నుంచి అలవోకగా వచ్చేస్తుంటుంది. సగం సగం ఉడికిన పాత్రల్లో ఆర్యది ఒకటి. ఆండ్రియా పాత్రకూ ప్రాధాన్యం లేదు. శ్రద్దా శ్రీనాధ్, రుహాని శర్మ వీళ్ల పాత్రలు కూడా అంతంత మాత్రమే.
యాక్షన్ సినిమా టెంపోకి తగ్గట్టుగానే టెక్నికల్ విభాగం పని చేసింది. నిర్మాణంలో క్వాలిటీ ఉంది. ఓ కలర్ పేట్రన్ ఫాలో అయినట్టు కనిపిస్తుంది. పాటలకు స్కోప్ లేదు. రాంగ్ యూసేజ్ పాట ఈ సినిమాలో రాంగ్ ప్లేస్ మెంట్. ఆ పాట కూడా కావాలని ఇరికించినట్టు అనిపిస్తుంది. హిట్, హిట్ 2 సినిమాలతో హిట్లు ఇచ్చిన శైలేష్ కొలను.. ఈ సినిమా కథ, కథనాలపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. ఎత్తుకొన్న పాయింట్ బాగుంది. దాని కోసం హీరో ఎలాంటి పోరాటం చేస్తాడా? అనే ఆసక్తి కలిగించాడు. కానీ ఆ కథని సవ్యమైన దారిలో, ఉద్వేగం, ఉత్కంఠత కలిగించేలా నడిపించలేకపోయాడు. వెంకీ కోసమో, తన 75 సినిమాలని సెలబ్రేట్ చేసుకోవడం కోసమో ఈ సినిమా చూడాలి. అంతే!
షినిషింగ్ టచ్: ఇంజక్షన్ గుచ్చుకొంది!
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్