బిజినెస్ లో డిమాండ్ సప్లయ్ సూత్రం చాలా ముఖ్యం. డిమాండ్, క్రేజ్ ఉన్నప్పుడే ప్రోడక్ట్ అమ్మేయాలి. అలా కాకుండా స్టాక్ మార్కెట్ షేర్స్ లా అంటిపెట్టుకుంటే రిస్క్ తప్పదు. అది పెరగొచ్చు. పడిపోవచ్చు. ఇప్పుడు వెంకటేష్ ‘సైంధవ్’ సినిమా వ్యవహారం కూడా ఇలానే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ తీసుకొచ్చింది. వెంకటేష్ స్టయిలీష్ యాక్షన్, డైరెక్టర్ శైలేష్ కొలను టేకింగ్.. నవాజుద్దిన్, ఆర్య, ఆండ్రియా ఇలా భారీ తారాగణం, నిర్మాణంలో రిచ్ నెస్ ఇవన్నీ సినిమాపై క్రేజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్లు వెళ్ళాయి. కానీ నిర్మాత వెంకట్ ఎందుకో మొదట్లో అంత ఆసక్తి చూపించలేదు. బహుసా ఇంకా ఎక్కువ చేస్తుందనే నమ్మకం కావచ్చు. కానీ సీజన్ మారిపోయింది. సంక్రాంతికి వరుస సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఆటోమేటిక్ గా సైంధవ్ పై డిమాండ్ తగ్గింది.
ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత వెంకట్ చెప్పారు. మీరు అనుకున్నంత బిజినెస్ జరిగిందా ? అన్న ప్రశ్నకు చాలా ఓపెన్ గా సమాధానం ఇచ్చారాయన. ”సైంధవ్ పై చాలా బజ్ వచ్చింది. థియేట్రికల్ గా చాలా మంచి బిజినెస్ జరుగుతుందని అనుకున్నాను. మొదట్లో చాలా ఎక్కువకి అడిగారు. ఏవో కారణాలలో అప్పుడు ఇవ్వడం కుదరలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముందు అనుకున్నంత జరగలేదనే చెప్పాలి. అయితే ఓటీటీలో మాత్రం చాలా మంచి రేటు వచ్చింది. ఈ విషయంలో చాలా ఆనందంగా వున్నాం’ అని చెప్పుకొచ్చారు నిర్మాత.