ఈ పండక్కి వచ్చిన 4 సినిమాల్లో… ‘హనుమాన్’ అందరి ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. ఆ తరవాత మహేష్ కోసం, మాస్ ఎలిమెంట్స్ కోసం గుంటూరు కారం చూస్తున్నారు. ‘నా సామిరంగ’లో పండగ వైబ్స్ కనిపించాయి. నాగ్ కూడా హుషారుగా ఉన్నాడు. ఆ సినిమా కూడా సంక్రాంతి వసూళ్లలో తన వాటా పంచుకొంది. అయితే ఈ 4 సినిమాల్లో ఒంటరిగా.. రివ్యూలకూ, ప్రేక్షకుల ప్రశంసలకూ దూరంగా నిలబడిపోయింది ‘సైంధవ్’ ఒక్కటే.
వెంకటేష్ 75వ చిత్రమిది. హిట్ ఫ్రాంచైజీలతో ఆకట్టుకొన్న శైలేష్ కొలను దర్శకుడు కావడంతో మరింత క్రేజ్ వచ్చింది. అయితే… దాన్ని ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ‘విక్రమ్’ లాంటి సినిమా తీయాలన్న ఆరాటంలో, యాక్షన్ మోజులో.. కథనీ, కథనాన్నీ గాలికి వదిలేశారు. వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. ఆయనకున్న క్లీన్ ఇమేజ్.. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది. కానీ.. ‘సైంధవ్’ సినిమా వాళ్లకు చాలా దూరంలో నిలిచిపోయింది. సంక్రాంతి లాంటి పెద్ద పండగలు వచ్చినప్పుడు కుటుంబ ప్రేక్షకులంతా కలిసి చూసే సినిమాలవైపు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారు. `సైంధవ్`లో ఆ లక్షణాలు లేవు. సంక్రాంతి ఎలాంటి సినిమా వచ్చినా చూస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు. ఆడియన్స్ లెక్కలు ఆడియన్స్కి ఉన్నాయి. వాళ్ల కంటికి ‘సైంధవ్’ అస్సలు కనిపించలేదు. 75వ సినిమాకి ఎలాంటి కథ ఎంచుకోవాలన్న విషయంలో వెంకీ పొరపాటు చేశాడు. తన బలాన్ని మర్చిపోయి.. యాక్షన్ కథవైపు మొగ్గు చూపించాడు. 75వ సినిమాగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఓ కథని ఎంచుకొని, దాన్ని సంక్రాంతి బరిలో దింపుకొంటే – వెంకీ 75వ సినిమా నిజంగానే ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోయేది.