ఎన్నికలకు ముందు అమరావతినే కొనసాగిస్తామని ఊరూవాడా ప్రచారం చేసి.. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కులు చేస్తున్న వైనంపై వస్తున్న విమర్శలపై వైసీపీ .. తనదైన శైలిలో ఎదురుదాడి ప్రారంభించింది. తము.. మూడు రాజధానులను మేనిఫెస్టోలో పెట్టామంటూ.. కొత్త వాదన ప్రారంభించారు. మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది… అందుకే.. వారే క్లారిటీ ఇచ్చారు. తాము బైబిల్‌గా భావించే మేనిఫెస్టోలో ఓ చోట.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ఉందట. దాని అర్థం.. మూడు రాజధానులేనని… చెబుతున్నారు. ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంను రంగంలోకి దింపిన వైసీపీ నేతలు.. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు.
చంద్రబాబునాయుడు రెండు రోజులకో సారి మీడియా సమావేశం పెట్టి.. గతంలో అమరావతి గురించి వైసీపీ నేతలు మాట్లాడిన మాటలను.. మీడియాలో ప్రదర్శిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలోనూ ఇవి హైలెట్ అవుతున్నాయి. దీంతో వైసీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. మాట తప్పినందున మళ్లీ ప్రజాభిప్రాయం తీసుకోవాలని… డిమాండ్లు అన్ని విపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. అయితే దీనిపై వైసీపీ స్పందించడం లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అనే పదం కనిపించడంతో.. దాంతోనే తమ విధానాన్ని డిఫెండ్ చేసుకోవాలని ముందుకు వస్తున్నారు. విచిత్రమైన లాజిక్‌తో రాజధాని తరలింపునకు కారణాలు చెబుతున్నారు.
అమరావతి తరలింపు వ్యవహారం.. వైసీపీకి పెద్ద చిక్కుగా మారింది. కోస్తా ప్రాంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ… జగన్ మాటను ఎవరూ జవదాటలేకపోతున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపుగా నాలుగేళ్ల సమయం ఉండటంతో.. వారంతా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కొంత మందిని మాత్రం ఎదురుదాడికి వైసీపీ ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో… మూడు రాజధానులను మేనిఫెస్టోలో పెట్టామంటూ.. కొత్త వాదనతో వైసీపీ రంగంలోకి దిగింది. వారికి ఉన్న సోషల్ మీడియా.. మీడియా బలంతో… జగన్ సహా.. వైసీపీ నేతలంతా చేసిన అమరావతి రాజధానిగా ఉంచుతామనే ప్రచారాన్ని తిప్పి కొట్టాలనే ప్రయత్నాలను చేస్తున్నారు. మరి ప్రజలను నమ్మించగలరో లేదో..?
ఇక మాపార్టీ విషయానికొస్తే వికేంద్రీకరణే లక్ష్యంగా 3 ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అదే మేనిఫెస్టోతో మా నాయకుడు ప్రజలముందుకు వెళ్లారు. ప్రజలు ఆశీర్వదించి 151 సీట్లతో గెలిపించారు. ఇప్పుడు చెప్పండి బాబుగారూ? ప్రజలు తీర్పు కోరాల్సింది మీరా? మేమా? (3/3)
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) August 7, 2020