వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కావొచ్చు కానీ ఆయన మూలవిరాట్లా ఉంటారు. అంతా చూసేది పూజారే. ఆ పూజారే సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా ప్రకటించిన పార్టీ పదవుల్లో ఆ స్థానాన్ని ఆయన తనకు తాను ప్రకటించేసుకున్నారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్ లకు సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ నియమించారు. అంతే మొత్తం సజ్జల గుప్పిట్లోకి పార్టీని పెట్టినట్లన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవులు లేని వాళ్లెవరూ లేరు. అందరికీ ఓ పదవి పంచేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పదవి పోయిన వాళ్లు..పదవి ఆశించిన వాళ్లు ఇలా ఎవర్నీ వదిలిపెట్టలేదు. అందరికీ ఓ పదవి ఇచ్చేశారు. వైసీపీ తరపున ఇరవై ఆరు మంది జిల్లాల అధ్యక్షుల్ని ప్రకటించారు. ఇందులో మంద్రి పదవులు పోగొట్టుకున్న వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
మాజీ మంత్రుల్లో కాస్త ఎక్కువ ప్రాదాన్యత ఉందనుకున్న వారికీ రీజనల్ కోఆర్డినేటర్ల పోస్టు ఇచ్చారు. కొడాలి నానికి కూడా రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే.. రెండు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. చివరికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మరీ హ్యాండిచ్చిన మర్రి రాజశేఖర్ కు కూడా రెండు జిల్లాలు కట్టబెట్టేశారు. రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చేశారు. తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు ఇస్తామని సీఎం జగన్ ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దానికి తగ్గట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి కసరత్తు చేసి.. ఈ జాబితాప్రకటించారు. ఈ పదవుల్లో సజ్జలకూ అగ్రభాగం దక్కింది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆయన రీజనల్ కోఆర్డినేటర్. మరో కోఆర్డినేటర్‌గా మంత్రి బుగ్గన ఉంటారు కానీ.. సజ్జల ఉండగా ఆయన చేసేదేమీ ఉండదు. ఇక సజ్జల చేతుల్లోనే పార్టీ ఉంటుంది.
విజయసాయిరెడ్డికి మాత్రం పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జీ పదవి మిగిలింది. వైసీపీలో అనుబంధ సంఘాల ఉనికి ఒక్క సాక్షి మీడియాలోనే కనిపిస్తుంది. ఇక విజయసాయిరెడ్డి దానికి మాత్రమే పరిమితం కావాలి. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని అధికారులు కోల్పోయిపవదులు పోగొట్టుకుంది విజయసాయిరెడ్డి మాత్రమే. విన్నర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నిలిచారు. పార్టీ అధ్యక్షుడు జగన్ అయినా.. మొత్తంగా సమన్వయక్తగా సజ్జల కాబట్టి ఆయననే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్పుకోవచ్చు.