వైసీపీ సోషల్ మీడియా చేసిన దురాగతాల నెట్ వర్క్ ను చేధించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి అంకం విజయవంతంగా పూర్తి అయింది. నర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ రెడ్డి వంటి వారిని అరెస్టు చేసినప్పుడు వారి అసలు మోటివ్ ఏంటి.. వారికి డబ్బులు ఎలా వస్తున్నాయి.. కంటెంట్ ఎవరు ఇస్తున్నారు.. అన్నది మొత్తం కనిపెట్టారు. అదే విషయాలను డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో ఏ-1గా సజ్జల భార్గవ్ రెడ్డితో కేసు నమోదు అయింది. ఇందులో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి అందరి పేర్లు ఉన్నాయి. వీరంతా ఏపీ రాజకీయాలను ఎలా కలుషితం చేశారో పోలీసులు తేల్చబోతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ సోషల్ కాలకేయ సైన్యాన్ని అరెస్టు చేశారు. ఇక ముందు నాయకుల్ని అరెస్టు చేయబోతున్నారు. అందులో ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ ఉండనున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాత్మకంగా తన కుమారుడ్ని సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి నుంచి తప్పించినట్లుగా ప్రకటించ చేసుకున్నారు. ఆయనను కనిపించకుండా చేశారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారా.. ఇండియాలో ఉన్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ పోలీసుల వేట మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు.
సజ్జల భార్గవ్‌తో పాటు ఎఫ్ఐఆర్లో ఉన్న వారంతా బూతు పితామహులే. క్రియేటివ్‌గా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాల్ని తిట్టడం ఎలా అన్న దానిపై వారు చేసిన ఖర్చు మొత్తం బయటకు రానుంది . అందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే వీరందరికీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలివ్వడం. వీరు పెంచి పోషించిన సోషల్ సైట్లకు..ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఖాతాలో నుంచి డబ్బులు చెల్లించారు. ఇవన్నీ బయటకు తీయబోతున్నారు. కుమారుడ్ని ఎంత దాచినా సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు సినిమా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.