మంత్రివర్గ విస్తరణ కారణంగా వైసీపీలో కొంత మంది అలకపాన్పు ఎక్కారని జరుగుతున్న ప్రచారంపై … కొత్తకేబినెట్ కసరత్తులో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి పరిస్థితి రాదన్నారు. కొంత మంది పాత మంత్రులు.. జగన్ వెంట మొదటి నుంచి ఉన్న వాళ్లు ప్రాధాన్యత కోరుకుంటున్నారు. వారికి బెర్త్ దొరుకుతుందన్న సంకేతాలురావడం లేదు. అదేసమయంలో తమ పేరు ఉంటుందని గట్టిగా అనుకుని.. చివరి క్షణంలో మళ్లీ సీనియర్లకే చాన్సిస్తారన్న ప్రచారంతో మరికొంత మంది ఆందోళనలో ఉన్నారు. ఈ పరిణామాలతో ఎవరినీ బుజ్జగించబోమని సజ్జల చెబుతున్నారు.
మంత్రుల వద్ద రాజీనామా లేఖలు తీసుకున్నప్పటికీ ఇంకా గవర్నర్కు పంపలేదు. ముఖ్యమంత్రి జగన్ అన్ని కాంబినేషన్స్ పై వర్కవుట్ చేస్తున్నారని… లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేసి చెబుతారని సజ్జల చెబుతున్నారు. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉంటుందని స్పష్టం చేశారు.కొత్త మంత్రుల జాబితాతో పాటు ఎవరెవర్ని తొలగించాలో వారి రాజీనామా పత్రాలను మాత్రమే గవర్నర్కు పంపే అవకాశాలు ఉన్నాయి. అందరి రాజీనామాలను గవర్నర్తో ఆమోదింప చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించడం ఎందుకని.. కేవలం తొలగించాలనుకున్న వారి రాజీనామా పత్రాలను మాత్రం గవర్నర్కు పంపితే సరిపోతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రితో రెండు రోజుల పాటు విస్తృతంగా జరిగిన చర్చల్లో సజ్జల పాల్గొన్నారు. మంత్రుల వద్ద రాజీనామాలు తీసుకున్న తర్వాత పరిస్థితులు… కేబినెట్లో చేయాల్సిన మార్పు చేర్పులపై చర్చించారు. మంత్రివర్గ సభ్యులను జగన్ ఖరారు చేసుకున్నారని అయితే ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ముందుగానే ప్రకటించడం వల్ల సమస్యలు వస్తాయని.. అందుకే కసరత్తు జరుగుతోందని సజ్జల చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.