ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్ తమను తిడుతున్నారని .. రాజకీయాల్లోకి బూతులు తీసుకు వచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ కు ముఖ్య సలహాదారులు… డిఫ్యాక్టో సీఎంగా ఫ్యాన్స్ చేత ప్రశంసలు.. ప్రతిపక్షాల చేత విమర్శలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి .. చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలను బూతులుగా తేల్చి.. మీడియా ముందుకు వచ్చి చిరాకుపడ్డారు. ఫ్రస్ట్రేషన్‌లోనే చంద్రబాబు, లోకేష్ వైసీపీపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఇంతకూ.. సజ్జలకు బూతులుగా అనిపించినవి చంద్రబాబు అన్న మాటలు … నిజంగానే చంద్రబాబు స్వభావానికి సరిపడనివి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో ఆదివారం ప్రచారం చేసిన ఆయన .. తన ప్రసంగ శైలిని ఒక్క సారిగా మార్చేశారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పాచి పని చేసుకుంటారు కానీ.. సొంత రాజధాని కోసం పోరాటం చేయరా అని ప్రశ్నించారు. వాడు రెండు వేలిస్తాడు.. తీసుకుని ఓటేయండి.. తర్వాత సర్వం కోల్పోతారని.. హెచ్చరించారు. అంతే అమరావతి ఉద్యమం కోసం ఇంటికొకరు రావాలని కూడా పిలుపునిచ్చారు. చంద్రబాబు స్పీచ్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉందని.. ఆయన అన్న కోణంలో ఆలోచిస్తే.. ఇబ్బంది ఎదురవుతుందని అనుకున్న వైసీపీ .. ఎప్పుడూ లేని విధంగా… వారి మీడియాలో నెగెటివ్ కోణంలో ప్రాధాన్యం కల్పించింది. ఓటర్లనుకించ పరుస్తున్నారని మరొకటని వాదించింది.
అదే సమయంలో సజ్జల లాంటి వాళ్లకు అవి బూతులుగా అనిపించాయి. అసలు వైసీపీ నేతలు మాట్లాడే విమర్శలతో పోల్చి చూస్తే.. చంద్రబాబు మాటలు అత్యుత్తమ సంస్కార వంతంగా అనిపిస్తాయి. అసలు టీడీపీ నేతపై బూతులతో దాడి చేయాలని.. వైసీపీని వ్యతిరేకించే వారు మానసికంగా ఇబ్బంది పడేలా మాటల దాడి చేసేలా వ్యూహం అంతా సజ్జలే నడిపిస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతుంది. అలాంటిది.. చంద్రబాబు చేస్తున్న ఘాటు విమర్శలు ఆయనకు బూతులా అనిపించడం టీడీపీ వర్గాను సైతం ఆశ్చర్య పరుస్తోంది.