తాము ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నాం.. విపక్ష నేతలు మాత్రం రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నరనే ఆందోళనతో వైసీపీ పెద్దలకు కన్నూమిన్నూ కానరానట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సభలను అడ్డుకోవడానికి చట్టం చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. జీవో నెంబర్ వన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో చంద్రబాబు సభలను ఎలా అడ్డుకోవాలో అర్థం కానట్లుగా ఉంది. అందుకే సజ్జల చంద్రబాబు ఇంకెంత మంది ప్రాణాలను తీస్తారని.. ఆయనను అడ్డుకోవడానికి కొత్త చట్టం తెస్తామంటున్నారు. న్యాయనిపుణులు, అధికారులతో మాట్లాడతామని చెప్పుకొచ్చారు.
జీవో వన్ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు దానిపై చట్టం తీసుకు రావాలంటే రాజ్యాంగాన్ని మార్చాలనే విషయాన్ని సజ్జల మర్చిపోయినట్లుగా ఉన్నారు. చంద్రబాబు మాత్రమే సభలు పెట్టకూడదని ఏదైనా చట్టం చేస్తారేమో కానీ.. వైసీపీ నేతల మాటలు మాత్రం.. పూర్తిగా ట్రోలింగ్ కు గురవుతున్నాయి. వారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని రెండు విషాద ఘటనలు జరగడం.. ఆ వెంటనే జీవో తేవడం వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. సజ్జల మాటలు వింటూంటే.. అది నిజమేనని ఎక్కువ మంది అనుమానపడాల్సి వస్తోంది.
సీఎం జగన్ పూర్తిగా సుఖానికి అలవాటు పడిపోయారు. ఆయనకు ప్రజల్లో కి వెళ్లే ఆలోచన కూడా లేదు. ఏ విధంగానూ ఆయన ప్రజలను కలవడం లేదు. ప్రతీ చోటా సమస్యలు తిష్టవేశాయి. పథకాల లబ్దిదారులను అడ్డగోలు షరతులతో పూర్తిగా తగ్గించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్లినా బాధితుల నిరసనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అసలు రోడ్డు మార్గం ద్వారా వస్తున్నారంటేనే ఓ చోట బాధితులు అడ్డం పడిపోయిన ఘటనలు జరిగాయి. ఇక జనాల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పడం పెద్ద కష్టమేం కాదు.