వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి తెలుసని అందరూ నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో.. అసలు జాబితాలో లేకపోయినా కొడాలి నాని తిరుపతికి వెళ్లడం..అక్కడ మళ్లీ మీడియా ముందుకు వచ్చి నేరుగా మోడీ పై వ్యాఖ్యలు చేయడం అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని నమ్ముతున్నారు. అయితే.. ఈ అంశంలో వైసీపీకి సంబంధం లేదని.. కొడాలి సంయమనం కోల్పోయి ఉండవచ్చన్న వాదనను వైసీపీ తెరమీదకు తీసుకు వచ్చింది.
వైసీపీ నేతలు తమ పార్టీ విధానాలపై ప్రెస్మీట్లు లాంటివి పెడితే.. దానికి సంబంధించిన ఇన్ పుట్స్ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే అందుతాయి. అందులో ఎలాంటి దాపరికం లేదు. అయితే ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చింది.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ…మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కావొచ్చని … చెబుతున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను సమర్థించబోము కానీ.. ఇప్పుడు ఆ విమర్శలను ప్రశ్నిస్తున్న వారు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్నించారు.
అయింతే మంత్రి కొడాలి నానిని హెచ్చరిస్తామని కానీ.. మరో విధంగా అయినా కానీ అలా మాట్లాడకుండా చూస్తామని సజ్జల ఎక్కడా హామీ ఇవ్వలేదు. పైగా.. బీజేపీ, టీడీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి ఉచ్చులో వైసీపీ నేతలు పడొద్దని అందరికీ కామన్‌గా ఓ సలహా ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. కొడాలి నాని విషయంలో వైసీపీ చర్యలు తీసుకుంటుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు కానీ.. అలాంటి చాన్సే లేదని సజ్జల రియాక్షన్ ద్వారా తేలిపోయిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుమలకు వెళ్లి ప్రధాని మోదీతో పాటు ఆయన భార్య విషయంలో కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టారు. కొడాలి నానిని తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.