జగన్ పై విమర్శలు వస్తే అందరికంటే ముందుగా ఆయనే మీడియా ముందు వాలిపోయేవారు. జగన్ పై సొంత చెల్లి మొట్టమొదట విమర్శలు చేసినప్పుడు ఆయనే ఎదురుదాడికి దిగారు. జగన్ కుటుంబ రాజకీయాల్లో తనెందుకు తలదూర్చాలని అనుకోకుండా విమర్శానాస్త్రాలు సంధించారు. జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు ఏం చేయాలో అన్నీ చేసేసిన ఆ నేత ఇప్పుడు గప్ చుప్ అయ్యారు.
ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి..వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు నెంబర్ 2గా సజ్జలే ఉన్నారు. విజయసాయి రెడ్డి మొదట్లో ఆ స్థానంలో ఉన్నా.. ఆ తర్వాత జగన్ ను సైతం డమ్మీ చేసేలా సజ్జల పార్టీలో పట్టు సాధించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడే నాటి వరకు ఆయనే మీడియాకు టచ్ లో ఉంటూ హడావిడి చేశారు.
Also Read : హైకోర్టులో విజయసాయిరెడ్డి కుమార్తెకు చుక్కెదురు!
వైసీపీ అధికారం కోల్పోయాక సజ్జల మీడియా ముందుకు రాలేకపోతున్నారు. పూర్తిగా తెరచాటు రాజకీయం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. జగన్ నిర్వహించిన సమావేశాలకు సైతం వచ్చామా..?వెళ్లామా..? అన్న తరహాలో సజ్జల వ్యవహరిస్తున్నారు.
జగన్ పై విమర్శల దాడి కొనసాగుతోన్నా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేసే ఆయన కిమ్మనడం లేదు. కూటమి నేతల నుంచే కాకుండా కొద్ది రోజులుగా జగన్ ను షర్మిల టార్గెట్ చేస్తున్నా.. సజ్జల సైలెంట్ మోడ్ లో నుంచి బయటకు రావడం లేదు.
ఈ విషయంలోనే కాదు.. వైసీపీకు సంబంధించిన ఏ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. మొన్నటి ఢిల్లీ ధర్నాలోనూ సామాన్య నేతగానే కనిపించారు తప్పితే మునుపటిలా ఆయన హడావిడి కనిపించలేదు. దీంతో సజ్జల సైలెన్స్ పై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.