పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ ఆఫీసులో సమావేశం పెట్టి సలహా ఇచ్చారు. అయితే ఈ సలహా .. స్మూత్‌గా లేదు. కొన్ని హెచ్చరికలతో వచ్చింది. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత వేటు వేయడానికి తమ దగ్గర కొత్త చట్టం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అనర్హతా వేటు గురించి సజ్జల పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే.. తమను కాదని.. ఎన్నికైనా అనర్హతా వేటు వేస్తామని చెప్పినట్లుగా ఉంది. తమ అభిప్రాయం ప్రకారం ఏకగ్రీవం చేసుకుంటే బోలెడన్ని నిధులిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం జీవో జారీ చేస్తోందని చెప్పారు.
అలా చెప్పిన కాసేపటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు పెంచింది. జనాభాను బట్టి రూ. 10 నుంచి 20 లక్షల వరకూ ఇస్తారు. సజ్జల ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత… జీవో ఇచ్చిన తర్వాత మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి… అదే విషయాన్ని చెప్పారు. అయితే.. సజ్జల మాట్లాడిన బెదిరింపులు .. చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు చేసినట్లుగానే పంచాయతీ ఎన్నికల్లోనూ చేయాలనుకుంటున్నారని టీడీపీ మండిపడింది.
సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషనర్ స్పందించి… కేంద్రబలగాల సాయంతో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఆయనపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. వైసీపీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో గెలవడం కన్నా… ఏకగ్రీవం చేసుకోవడానికే ఎక్కువ తాపత్రయ పడుతోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. అయితే బలవంతపు ఏకగ్రీవాలు.. అక్రమాల విషయంలో ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంజయ్ అనే ఐజీ స్థాయి పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించింది.