ప్రత్యేకహోదా పేరు మాత్రమే లేదు.. ఆ ప్రయోజనాలన్నీ ఇచ్చాం అని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను వైసీపీ అమలు చేస్తోంది. అయితే అది హోదా విషయంలో కాదు.. రాజధానుల విషయంలో. అమరావతి, కర్నూలుల్ని రాజధానులు అని పిలవకపోయినా రాజధానులుగా అభివృద్ది చేస్తామనే కొత్త వాదనను సజ్జల తెర ముందుకు తీసుకు వస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు, న్యాయస్థానాల్లో ఇంగ్లిష్లో ఏపీకి మూడు రాజధానులనేది పూర్దిగా తప్పుడు ప్రచారమని.. మిస్ కమ్యూనికేషన్ అని ఘంఠాపథంగా చెబుతున్న వైసీపీ సీఎం, మంత్రులు..ఏపీకి వచ్చే సరికి తెలుగులో మాత్రం.. అదేమీ తెలియదన్నట్లుగా ప్రజల వద్ద తమ విధానం మూడు రాజధానులే అని బొంకుతున్నారు. సుప్రీంకోర్టులో న్యాయరాజధాని అనేదే లేదని ప్రభుత్వం వాదించింది. ఢిల్లీలో సీఎం జగన్ విశాఖే రాజధాని అన్నారు. బెంగళూరులో బుగ్గన అసలు మూడు రాజధానులు అనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తూ.. వినిపిస్తూ ఉండగా.. తెలుగులో వైసీపీ నేతలు మాత్రం.. మూడు రాజధానులే తమ విధానమని అందులో మార్పు లేదని చెప్పుకొచ్చారు.
మూడు రాజధానులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని… వైసీపీ విధానం మూడు రాజధానులేనని అంబటి రాంబాబు ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయి.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని కొత్త భాష్యం చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే విధంగా మాట్లాడారు.. బుగ్గన ఏ సందర్భంలో చెప్పాలో తెలియదని.. వైజాగ్ లో సచివాలయం ఉండాలి…అసెంబ్లీ అమరావతి లో ఉంటుంది హై కోర్ట్ కర్నూలు లో ఉంటుంది ..ఇదే మా విధానం అని ప్రకటించారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామమన్నారు. రాజధాని అనే పేరు పెట్టుకున్న లేకున్నా మూడు ప్రాంతాల అభివృద్ధి ఎజెండా అని సజ్జల చెప్పుకొస్తున్నారు.
అంటే రాజధాని అనే పేరు లేకపోయినా అభివృద్ది చేస్తామని అక్కడ హైకోర్టు పెడతామని.. ఇక్కడ అసెంబ్లీ ఉంటుందని సజ్జల చెప్పాలనుకుంటున్నారు. మొత్తంగా వైసీపీ నేతల వ్యవహారశైలి.. ప్రకటనలు పూర్తి స్థాయిలో ప్రజల్ని పిచ్చి వాళ్లుగా పరిగణిస్తున్నట్లుగా ఉంది. తాము ఏం చేసినా.. చెప్పినా నమ్మే జనం ఉన్నారన్నట్లుగా వారి ధీమా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.