వైసీపీలో పూర్తి స్థాయిలో అవమానికి గురైన.. పూర్తిగా తీసి పక్కన పెట్టేసిన విజయసాయిరెడ్డి ఎట్టకేలకు మళ్లీ జగన్ మనసు మారేలా చేయగలిగారు. పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతల్ని పొందగిలిగారు. పార్టీ మొత్తాన్ని గుంపగుత్తగా తన గుప్పిట్లో పెట్టుకుందామని ప్రయత్నించిన సజ్జల రామకృష్ణారెడ్డికి మ్యాచ్ అయిపోయిన తర్వాతైనా చెక్ పెట్టగలిగారు. ఇప్పటి వరకూ పార్టీ కార్యాలయంలో ఉంటూ అనుబంధ సంఘాలను మాత్రం చూసుకోవాలని జగన్ విజయసాయిరెడ్డికి సూచించారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి జిల్లాల అధ్యక్షుల్ని.. అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు అందర్నీ సమన్వయం చేసుకునే బాధ్యతలిచ్చారు . దీంతో పార్టీ మొత్తం ఆయన గుప్పిట్లో ఉన్నట్లయింది. కానీ హఠాత్తుగా జగన్ నిర్ణయం మార్చుకున్నారు. జిల్లాల అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను కూడా విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం అనే కొత్త బాధ్యతలిచ్చి.. దానితో పాటు ఎప్పుడూ చూసుకునే మీడియా బాధ్యతలిస్తున్నట్లుగా పత్రం విడుదల చేశారు.
వైసీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తనను పార్టీలో తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని.. తాను జాబ్ మేళాలు పెట్టినా పార్టీ నేతలెవరూ రాకుండా చేస్తున్నారని ఆయన జగన్ వద్ద ఆవేదన చెందారని.. దీంతో జగన్ కూడా.. మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీపై పట్టు తగ్గించి ఆ ప్లేస్‌ను విజయసాయిరెడ్డికి ఇవ్వడమే ఇప్పుడు వైసీపీలో సంచలనంగా మారింది.