జగన్ రెడ్డి పాలనపై చర్చకు రావాలని చంద్రబాబు చేసిన సవాల్ కు ఎలా స్పందించాలో వైసీపీకి అర్థం కాలేదు. మామూలుగానే మాట్లాడటం చేతకాని జగన్ రెడ్డి.. చంద్రబాబు ముందు డిబేట్ కు కూర్చోవడం అనే మాటను ఎవరూ ఊహించలేరు. అసెంబ్లీలో అయితే చంద్రబాబును ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించి పంపేయవచ్చు..కానీ పబ్లిక్ డిబేట్ లో అలా కాదు. తన పాలన పై సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఏం చెప్పాలా అని మేథో మథనం చేసి చివరికి రూ. 140 కోట్ల సలహాదారుడు సజ్జల మీడియా ముందుకు వచ్చారు. జగన్ రెడ్డి చర్చకు రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
దీంతో ఇక టైం, డేట్ ఫిక్స్ చేస్తారేమోనని అందరూ అనుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అనుకున్నారు. ఇద్దరు ముఖ్య నేతలు సామర్థ్యాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారనుకున్నారు. కానీ సజ్జల అతి తెలివి తేటలు తర్వాత బయట పడ్డాయి. జగన్ రెడ్డి చర్చకు రావాలంటే.. అంటూ కొన్ని సాకులు వెదుక్కున్నారు. పధ్నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. చెప్పుకోవడానికి ఓ పథకం లేదన్నారు. జగన్ రెడ్డి చాలా పనులు చేశాడని.. డీబీటీ లెక్కల్లో తప్పులుంటే చెప్పాలన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత చర్చకు రావాలన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తూ..దానిపై డిబేట్ కు రావాలంటున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు జగన్ రెడ్డి మాట్లాడిన మాటల వీడియోనే పెట్టారు. అవి గోబెల్స్ ప్రచారం అయితే.. జగన్ రెడ్డి గోబెల్సే కదా. సజ్జల ఈ లాజిక్ మిస్సయ్యారు.
అసలు జగన్ రెడ్డి డిబేట్ కు వస్తే.. చంద్రబాబు పధ్నాలుగేళ్లలో ఏం చేశారో.. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఏం చేశారో.. ఇద్దరూ చర్చించి ప్రజల ముందు పెడతారు కదా.. మధ్యలో సలహాదారుడి ప్రమేయం ఎందుకో చాలా మంది కి అర్థం కావడం లేదు. చంద్రబాబు సవాల్ విసిరారు.. దానికి వస్తామో లేదో చెప్పుకోవాలి. ధైర్యం ఉంటే.. డేట్, టైం ఫిక్స్ చేసుకోవాలి. కానీ సాకులు చెప్పి తప్పించుకుంటే…అందరూ నవ్వుతారు. ఇప్పుడు అదే జరిగే పరిస్థితి వస్తోంది.