ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉండి పార్టీని పాతాళంలోకి పడేసిన వ్యక్తిగా వైసీపీలో అందరి మెప్పు పొందుతున్న సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఈ సారి పార్టీ మొత్తానికి చీఫ్ సలహాదారుగా పోస్టు ఇచ్చారు. వైసీపీలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని కొత్తగా నియమించి దానికి సజ్జలను చీఫ్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమితులయ్యేదేముంది ఆయనే కదా అన్ని రకాల సలహాలు ఇస్తోందని వైసీపీ నేతలు పెద్దగా ఆశ్చర్యపోలేదు.
వైసీపీలో ఏ కమిటీ అయినా ఊరకనే ఉంటుంది. జగన్ రెడ్డి తన పార్టీకి పొలిట్ బ్యూరో తరహాలో రాజకీయ సలహాల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికైనా పదవి లేదు అని అసంతృప్తి చెందితే వారిని తీసుకొచ్చి ఈ కమిటీలో పడేస్తారు. ఈ కమిటీ ఎప్పుడైనా సమావేశం అవుతుందో లేదో ఆ కమిటీలో ఉన్న వారికి కూడా తెలియదు. అంత గొప్పగా నడుపుతారు. కానీ ఇప్పుడు పీఏసీని పునర్ వ్యవస్థీకరించినట్లుగా ప్రకటనలు చేసి.. సజ్జల కన్వినీర్ గా నియమించినట్లుగా ఎందుకు ప్రకటించారన్నది ఆసక్తికరం.
జగన్ రెడ్డి ఓ కోటరీ మాయలో ఉన్నారని.. ఆ కోటరీ నుంచి బయటకు రావాలని విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు వైసీపీలో చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సజ్జల పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. కానీ.. జగన్ రెడ్డి జుట్టు విజయసాయిరెడ్డి కన్నా ఎక్కువగా తన చేతిలోనే ఉందని సజ్జల ఎప్పటికప్పుడు నిరూపించేందుకు తన ప్రాధాన్యతను బయట పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పీఏసీ కన్వీనర్ గా నియమితులైనట్లుగా ప్రకటింప చేసుకున్నారు. ప్రకటించినా .. ప్రకటించకపోయినా సలహాలు ఆయనవే.. ఆదేశాలు ఆయనవే అని.. వైసీపీ వాళ్లకు బాగా తెలుసు.