సజ్జల రామకృష్ణారెడ్డి,ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. ఈ ముందస్తు బెయిల్ ఒక్క కేసులోనే వర్తిస్తుంది. పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు పోలీసులు అరెస్టు చేసినప్పుడు పోసాని వారికి ఓ నేరాంగీకార పత్రం ఇచ్చాడు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టులు పంపితే.. తాను తిట్టిన తిట్లను భార్గవరెడ్డి వైరల్ చేసేవాడని చెప్పారు. దీంతో ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ తమను అరెస్టు చేస్తారని భయపడిపోయి ఆ రోజునే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఆ పిటిషన్ పై విచారణ గురువారం జరిగింది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పోసాని కృష్ణమురళి ఇచ్చిన నేరాంగీకార పత్రం ద్వారా వీరిపై పోలీసులు ఇప్పటికీ కేసులు నమోదు చేయలేదు. నోటీసులు జారీ చేయలేదు. అయితే తమను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వారు కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ కేసులో ఇక వీరిని అరెస్టు చేయలేరు కానీ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవచ్చు.
ప్రభుత్వం మారినప్పటి నుంచి సజ్జల భార్గవరెడ్డి బయట కనిపించలేదు. ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎప్పటికప్పుడు రిలీఫ్ పొందుతూ వస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా టీడీపీ ఆఫీసుపై దాడి దగ్గర నుంచి అనేక అంశాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా ముందస్తు బెయిల్స్ కోసం పోరాడుతున్నారు. కొన్ని కేసుల్లో తెచ్చుకున్నారు.