టీడీపీ ఆఫీసుపైకి రౌడీమూకల్ని పంపించి ధ్వంసం చేయించిన ఘటనలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సజ్జల ఇచ్చిన సమాధానం “గుర్తు లేదు”. లభించిన ప్రాథమిక ఆధారలతో ఆయన కోసం మొత్తం 38 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేశారు. ఆ ప్రశ్నలకు పోలీసులు అడిగారు. అడిగిన ప్రశ్నలకు అడిగినట్లుగా గుర్తు లేదని చెప్పి తప్పించుకున్నారు. దీంతో గంటన్నరలో విచారణ పూర్తయింది. పంపించేశారు.
అయితే సజ్జల బయటకు వచ్చి సుభాషితాలు చెప్పారు. ఆ మాటలు వింటే వారి పాలనలో ఏం జరిగిందో అందరూ అంత త్వరగా మర్చిపోతారా .. లేకపోతే సజ్జలే మర్చిపోయారా అని ఆశ్చర్యపోవచ్చు. ప్రజలు అధికారం ఒకదానికి ఇస్తే మరో దానికి ఉపయోగిస్తున్నారని.. ఈరోజు టీడీపీ మొదలుపెట్టిన విష సంస్కృతిని ఏదోక రోజు తప్పకుండా వారు కూడా ఎదుర్కొంటారని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మేము ఇలా ఉండుంటే అనేకమందిపై కేసులు పెట్టేవాళ్ళమని కూడా చెప్పుకొచ్చారు. కనీస విచారణ లేకుండా పేర్లు రాసుకుని, వాగ్మూలం ఆధారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.
టీడీపీ నేతలపై కనీసం మూడు వేలకుపైగా తప్పుడు కేసులు పెట్టించిన విషయం సజ్జలకు గుర్తు లేదు. అసుల పేపర్ లీక్ కాకపోయినా.. మాల్ ప్రాక్టీస్ జరిగినా దాన్ని లీక్ గా మార్చి కాలేజీ వ్యవహారాలతో సంబంధం లేని నారాయణను ఫోన్ ట్యాప్ చేసి మరీ హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఇలాంటివి చెప్పుకుంటే కొన్ని వందలు ఉంటాయి. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి చిన్నది కాదు. ఎప్పుడో జరిగిందని ఆయన చెప్పుకొస్తున్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడికి కర్త, కర్మ, క్రియ సజ్జల రామకృష్ణారెడ్డి, కానీ ఆయన తప్పించుకుని మిగతా అందర్నీ ఇరికించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.