వైసీపీ పరాజయానికి కారణం ఎవరు అని వైసీపీలో ఇంకా సమీక్ష ప్రారంభం కాక ముందే కొంత మంది తెరపైకి వస్తున్నారు. అంతా సీఎంవో అధికారులే చేశారని.. ధనుంజయ్ రెడ్డి చేశారని చెప్పడం ప్రారంభించారు. హఠాత్తుగా ఓ అధికారిని బాధ్యుల్ని చేస్తూ ఎందుకు నిందలు ప్రారంభించారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ధనుంజయ్ రెడ్డితో పాటు ఎప్పుడూ జగన్ వెంట ఉండే వైఎన్ఆర్ అనే వ్యక్తిపై నిందలు వేస్తున్నారు. నిజానికి వారు చేసేదేమీ ఉండదు. సహాయకంగా ఉండిచెప్పినట్లుగా చేయడం మాత్రమే. అసలు వ్యవహారం మొత్తం సజ్జల క్యాంప్ నుంచే నడిచేది.
వైసీపీలో ఏం జరిగినా సజ్జలే. ఆయన చెప్పందే… ఆకు కూడా కదలదు. ఆ విషయం వైసీపీలో అందరికీ తెలుసు. తానే పెద్ద విశ్లేషకుడినని… జనం నాడిని ఎలా ట్యూన్ చేయాలో తనకు తెలుసన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ఎమ్మెల్యేలను జగన్ కలవలేకపోవడానికి కారణం ఆయనే. తనను కలిస్తే చాలన్నట్లుగా చేశారు. ఫలితంగా ఘోర పరాజయం ఎదురయింది. అయితే ఇప్పుడు నింద తన మీదకు రాకుండా ధనుంజయ్ రెడ్డి మీదకు తోసేస్తున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది.
ఓటమికి జగన్ దే బాధ్యత అని కొంత మందితో చెప్పిస్తున్నారు. కానీ సజ్జలపై మాత్రం అసంతృప్తి బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఎవరూ బయటకు మాట్లాడకుండా… పత్రికా ప్రకటనలు చేయకుండా హెచ్చరిస్తున్నారు. సజ్జలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే పార్టీలో భవిష్యత్ ఉండదని హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి నేరుగా జగన్ ను కలిసే యాక్సెస్ లేకపోవడంతో చాలా మంది … సమయం కోసం ఎదురు చూస్తున్నారు.