ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి రోలేమిటి..?. ఆయన రాజ్యాంగేతరశక్తిగా మారి.. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి..? చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా.. తనను చంపించడానికి జగన్ ప్లాన్ చేశారని కాకుండా.. సజ్జలే ప్లాన్ చేశారని ఎందుకు ఆరోపిస్తున్నారు..?.. ఇవన్నీ ఇప్పుడు.. అటు రాజకీయవర్గాల్లో.. ఇటు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు. సజ్జల రామకృష్ణారెడ్డి డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిజానికి ప్రభుత్వ వ్యవహారాలు ఎలా నడుస్తాయో తెలిసిన వారికి..ఇందులో వాస్తవం ఉందని అంగీకరిస్తారు.
సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగీకుడు. నిన్నామొన్నటిదాకా విజయసాయిరెడ్డి నెంబర్ టూ పొజిషన్లో ఉండేవారు. కానీ ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సజ్జలదే ప్రముఖ పాత్ర. ఆయనను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ముఖ్య సలహాదారుగా నియమించారు. పేరుకు సలహాదారే కానీ.. ప్రభుత్వంలోని కీలకమైన విభాగాల ముఖ్య కార్యదర్శులంతా ఆయననే సంప్రదిస్తారు. ఆయనమాత్రం.. ప్రధానంగా హోంశాఖను పరిశీలిస్తారు. పోలీసు వ్యవస్థను మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని డీజీపీ ఆఫీసుతో పరిచయం ఉన్న వారెరవరికైనా అర్థమైపోతుంది. కానిస్టేబుళ్ల బదిలీల దగ్గర్నుంచి.. రాజకీయాలకు సంబంధించి.. ఎవరెవరిపై ఎలాంటి కేసులు పెట్టాలన్నదాని వరకూ అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారు. డీజీపీ ఆఫీసులో గతంలో సాక్షి తరపునపని చేసి ప్రస్తుతం.. ప్రభుత్వ పేరోల్స్‌లో ఉన్న ముగ్గురు జర్నలిస్టులు ఎప్పుడూ ఉంటారు. అక్కడి వ్యవహారాలన్నీ సజ్జలకు చేరిపోతూంటాయి. వారి ద్వారానే పోలీసులకు ఎప్పుడేంచేయాలో సందేశాలు వెళ్తూంటాయని చెబుతూటారు.
ఎప్పుడూ లేని విధంగా డీజీపీ రాజకీయ పార్టీలు చేసే విమర్శలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. రాజకీయాలతో ఆయనకేం పని అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన పేరు మీద వచ్చే ప్రెస్నోట్ల విషయం డీజీపీకి కూడా తెలుసో లేదో స్పష్టత లేదు. ఈ అంశంలో టీడీపీకి కూడా స్పష్టత ఉంది.. అందుకే.. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో.. ప్రతీ అంశానికి డీజీపీకి లేఖలు రాస్తారు. ఆయన ఈ లేఖలు రాయడం వెనుక ఏదో ఉందని.. ఓ సారి సజ్జలకు అనుమానం వచ్చింది. అందుకే ప్రెస్మీట్లు పెట్టి. .. ప్రతిపక్ష నేత డీజీపీకి లేఖలు రాయడం ఏమిటని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ వ్యవహారంలో లేఖ రాసింది తానేనని ఆయన చెప్పారు. అలాంటప్పుడు.. వివాదం లేదు. కానీ ధర్డ్ పార్టీ అయిన విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాశారని.. సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. అదెలా సాధ్యమన్న ప్రశ్న చాలా మందికి వచ్చింది. కానీ సజ్జలే డీల్ చేస్తున్నారు కాబట్టి… విచారణ జరుగుతోందని.. డీజీపీ నిమిత్తమాత్రుడన్న అభిప్రాయాన్ని అప్పుడే టీడీపీ నేతలు వినిపించారు. హోంమంత్రిగా ఉన్న సుచరితకు కనీస పరిజ్ఞానం ఉండదు. ప్రెస్మీట్లు పెట్టమన్నప్పుడు మాత్రమే ఆమె పెట్టి.. రాసిచ్చింది చదువుతారన్న చర్చ ఉంది. అందుకే మొన్న దిశ చట్టం అమల్లోకి వచ్చేసింది.. ముగ్గురికి ఉరేశామని కూడా చెప్పి నవ్వులపాలయ్యారు. మొత్తానికి సజ్జల వ్యవహారం.. పోలీసు వర్గాలతోపాటు.. రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.