ఎస్ఆర్కే అంటే ఎవరైనా షారుఖ్ ఖాన్ అనుకుంటారు. కానీ వైసీపీ అభిమానస్తులకు మాత్రం ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన లేకుండా వైసీపీలో ఎవరూ గాలి కూడా పీల్చలేరన్నంతగా కథ నడిపారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన జగన్ చుట్టూనే కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా కనిపించడం మానేశారు. కొద్ది రోజుల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియా విషయంలో మీటింగులు పెడుతున్నారు తప్ప.. పార్టీ వ్యవహరాల్లో ఎలాంటి సమావేశాలు పెట్టడం లేదని చెబుతున్నారు.
పార్టీ కార్యాలయాన్ని జగన్ రెడ్డి తాడేపల్లిలో అద్దాల మేడ నుంచి.. తన ఇంట్లోకి మార్చుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసు పేరుోత ప్రజా ధనంంతో చేయించుకున్న ఏర్పాట్లు ఉండటంతో పార్టీ కార్యాలయంగా అది ఉపయోగపడుతోంది. అయితే ఆ కార్యాలయంలో సజ్జల పెద్దగా కనిపించడం లేదు. జగన్ బెంగళూరు వెళ్లినప్పుడు ఆయనకు ఇక్కడ పనేమీ ఉంటుందని అనుకున్నా… జగన్ పర్యటనల్లోనూ కనిపించకపోడం వైసీపీ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది.
అయితే ప్రభుత్వం గతంలో జరిగిన కుట్రలన్నింటినీ బయటకు తీస్తోందని చాలా మంది తప్పు చేసిన అధికారులు అనధికారిక అప్రూవర్లుగా మారి ప్రభుత్వానికి కావాల్సినంత సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ఇరుక్కుపోయేది సజ్జలే. అందుకే ఆయన ఎందుకైనా మంచిదని విజయవాడ కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారని అంటున్నారు. ఆయన కుమారుడు ఇప్పటికే అడ్రస్ లేకుండా పారిపోయాడు. ఆయనను మళ్లీ వ్యాపారం బర్మా పంపించి ఉంటారని.. వైసీపీలోనే సెటైర్లు పడుతున్నాయి. అయితే వైసీపీ ఎస్ఆర్కే మాత్రం అంత తేలికగా తప్పించుకోలేరని.. టీడీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.