టీడీపీ ఆఫీసుపై దాడి విషయంలో నోటీసులు రావడంతో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే ఇప్పుడు ఎలా విచారణ చేస్తారని విచిత్రమైన లాజిక్ లెస్ ప్రశ్న వేశారు. వైసీపీ హయాంలో చేశారు. కేసులు పెట్టలేదు. పెట్టినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారినా పట్టించుకోకూడదని.. చాలా కాలం అయింది కాబట్టి వదిలేయాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లుగా దాడులు చేసి పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని కేసులు లేకుండా చేసుకుంటే అవన్నీ చట్టబద్ధం అయిపోతాయా ?
ఇప్పుడు దర్యాప్తు చేసి ఏం చేస్తారని.. తనను 120వ నిందితుడిగా చేర్చారని.. కావాలనే సీఐడీకి ఇచ్చారని చెప్పుకొచ్చారు. సీఐడీకి కావాలనే ఇస్తారన్న సంగతి కూడా సజ్జలకు ఎందుకు తెలియదో కానీ.. ఆయన మాత్రం ఒక్క నోటీసుకే వణికిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రతి అడ్డమైన దానికి కేసులు పెట్టి తప్పు చేయకరపోతే నిరూపించుకో అని సవాల్ చేసేవారు. మరి ఇప్పుడు నేను నిరూపించుకుంటా అని ఆయన సవాల్ చేయవచ్చు. కానీ అలాంటి సవాల్ మాత్రం చేయడం లేదు.
పైగా స్కిల్ కేసులో ఈడీ కేసులో చంద్రబాబు ప్రస్తావనే లేకపోయినా.. ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టులు ఈ ప్రచారాల్ని నమ్మబోవని చెప్పుకొచ్చారు. ఆ కోర్టుల్లో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోబట్టే కదా.. అదే విషయాన్ని చెప్పి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సజ్జల చెప్పినా చెప్పకపోయినా ఆయనపై ఇంకా బోలెడన్ని కేసులు వస్తాయి.. తాను నిర్దోషినని నిరూపించకోవాల్సిందేనని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.