“నీ ఎదవతనంతో పోలిస్తే నా ఎదవతనం ఓ లెక్కా” ఓ సినిమాలో తండ్రీ కొడుకులు తమ గొప్పదనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల తీరు అలాగే ఉంటోంది. ఏపీ విపరీతంగా అప్పులు చేసిందని… పరిమితికి మించి తప్పుడు లెక్కలతో రుణాలు తీసుకుందని కేంద్రం లెక్కలు తీస్తోంది. కొత్త రుణాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. కేంద్రం ఏమైనా తక్కువ అప్పులు చేసిందా అని ప్రశ్నిస్తోంది. 119 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం అప్పులు చేసిందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆ మొత్తం ఏం చేశారన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కేంద్రంతో పోలిస్తే తాము చేసిన అప్పులు చాలా తక్కువ మొత్తమేనని అంటున్నారు.
అప్పులకు అనుమతి తెచ్చుకునే విషయంలో కేంద్రంతో పోరాటానికి కూడా వెనుకాడేది లేదని ఏపీ ప్రభుత్వం .. తన ముఖ్య సలహాదారు మాటల ద్వారా గట్టి సందేశాన్ని బీజేపీ పెద్దలకు పంపినట్లుగా తెలుస్తోంది. తమ అప్పులను ప్రశ్నిస్తే బీజేపీ చేసిన అప్పులను ప్రశ్నిస్తామని నేరుగానే సందేశం పంపారు. ఇప్పుడు బీజేపీలోనూ ఈ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ ఏంచేసినా.. ఎలా ఉన్నా మద్దతు తెలుపుతూనే ఉన్న వైసీపీ ఒక్క సారిగా రూటు మార్చి ప్రభుత్వ విధానాలను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేయడం వారిని అసహనానికి గురి చేస్తోంది. అసలు అప్పులు చేయడంలో కేంద్రంతో పోటీ పడేలా వ్యవహరించండం ఏమిటన్న అభిప్రాయం బీజేపీ పెద్దల్లో వ్యక్తమవుతోంది.
ఇది ప్రారంభమేనని వైసీపీ నైజం ముందు ముందు కేంద్రానికి మరింత బాగా తెలియనుందని .. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన.. వ్యవహారశైలి చూసిన వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్ని చట్టాలను ఉల్లంఘించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా .. కేంద్రం చూసీ చూడనట్లుగా ఉంది. దీన్నే ఇప్పుడు ఆసరాగా చేసుకుని వైసీపీ కేంద్రాన్ని..,బీజేపీని చిక్కుల్లో పెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ అంశం ప్రస్తుతం అప్పుల లెక్కల వద్దే ఉంది.. తర్వాత తర్వాత చాలా సీరియస్ అంశాలపైకి వెళ్లనుందని అంచనా వేస్తున్నారు.