అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి క్రాస్ రోడ్స్ లో వదిలేశారని బాధపడ్డ యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. చాన్స్ ఇస్తే టీడీపీలో చేరుతానని మీడియా ముఖంగా చంద్రబాబుకు చెప్పారు. అనుచరులతో మరోసారి సమవేశం అయిన యార్లగడ్డ.. తాను పార్టీకి ఎంతో సేవ చేసినా సజ్జల రెడ్డి పోతే పో అనడం బాధించిందన్నారు. మూడేళ్లుగా తనను అవమానిస్తున్నారని.. పోతే పో అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెండు రోజులకిందట సజ్జల రామకృష్ణారెడ్డి.. యార్లగడ్డ విషయంలో ఉంటే ఉండొచ్చ.. పోతే పోవచ్చు.. ఎవరికైనా స్వేచ్చ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే యార్లగడ్డ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత స్పందించారు. పోతే పో అని ఎవ్వరు అన్నారని తాడేపల్లిలో ఎదురు ప్రశ్నించారు. టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదని స్పష్టం చేశారు. ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో తాను మాట్లాడానన్నారు. అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని.. అంతే కాని బయట మాట్లాడ్డం మంచిది కాదని సూచించారు. యార్లగడ్డ విషయం లో ఇదే చెప్పానని కవర్ చేసుకున్నారు. కానీ సజ్జల టార్గెట్ .. గన్నవరంలో ఎవరో ఒకర్ని బయటకు పంపడం.. వంశీని ఇప్పుడు బయటకు పంపలేరు. టిక్కెట్ నిరాకరించలేరు. ఆయనను అలా వాడుకున్నారు. అందుకే వెంకట్రావుకు పొగ పెట్టారు. వైసీపీలో చాలా మంది నేతలకు ఇదే ట్రీట్ మెంట్ ప్లాన్ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడ్డారా లేదా.. ఖర్చు పెట్టుకున్నారా లేదా అన్నది కాదు ముఖ్యమని..ఇప్పుడు ఉపయోగపడతారా లేదా అన్నదే కీలకమని చెబుతున్నారు. సజ్జల రెడ్డి నోటి దురుసుగా మాట్లాడుతున్నారో.. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారో కానీ చాలా మంది వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.