ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల చేసిన విమర్శలపై జగన్ రెడ్డితో పాటు ఆయన సలహాదారులంతా బాధపడ్డారట. ఆ విషయాన్ని చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చారు. షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయన్నారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ చేసిన ద్రోహం వైఎస్ కు పదవులు ఇచ్చి ప్రోత్సహించడమే. ప్రమాదంలో వైఎస్ చనిపోగానే ఆయన కుటుంబం అంతా.. ఇంత కాలం ప్రోత్సహించిన వారిపైనే హత్య ఆరోపణలు చేసి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని అప్పటి వరకూ ఆదరించిన పార్టీ పీక నొక్కేశారు. అసలు ద్రోహం చేసింది వైఎస్ ఫ్యామిలీ అయితే.. సజ్జల కాంగ్రెస్ చేసిందని వాదించడానికి వచ్చేశారు. ఇప్పుడు ద్రోహంలో ద్రోహం అన్నట్లుగా చెల్లికే జగన్ రెడ్డి ఆ ద్రోహం చేయడంతో.. కాంగ్రెస్ లో న్యాయం చేసుకునేందుకు షర్మిల వెళ్లారు. దాంతో సజ్జల మళ్లీ పాత రాజకీయం ప్రారంభించారు.
చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్పై అక్రమ కేసులు బనాయించారని.. . కాంగ్రెస్లో చేరాక షర్మిల యాస, భాష మారాయని చెప్పుకొస్తున్నారు. చనిపోయిన వైఎస్సార్ పేరును ఛార్జ్షీట్లో చేర్చారు.. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ఆయన ప్రశ్నిస్తున్నారు. బహుశా ఆయనకు తెలిసిందే అందరికీ తెలియాలని.. అదే నిజమని నమ్మాలన్న భావనలో ఉన్నట్లున్నారన్న సెటైర్లు సహజంగానే వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి క్రైస్తవుడని చెప్పేలా.. షర్మిల విమర్శలు చేయడం వైసీపీని ఎక్కువగా బాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా బూతులు ప్రారంభించేసింది కూడా.