హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో తన పేరు రావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తనకు సంబంధం లేదని… తన పేరు వాడితే న్యాపరమైన చర్యలు తీసుకుంటానని కూడా బెదిరించారు. ఆ పిల్లి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ ఉండరు కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఆయన తనకేమీ సంబంధం లేదని తప్పుకోవడం. మిగతా పోలీస్ ఆఫీసర్లను బలి చేసేసి.. ఆయన సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయిపోవడం.
సజ్జల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల పాటు సకలశాఖ మంత్రిగా వ్యవహరించారు ఆయన అనధికారికంగా పోలీసు వ్యవస్థను నడిపారు. ఒక్క లా అండ్ ఆర్డర్ ని కాదు. సీఐడీతో పాటు అన్ని రకాల పోలీసు వ్యవస్థల్ని గుప్పిట పట్టుకుని తన బాస్ సెటిల్మెంట్ల రాజ్యానికి మంత్రిలా వ్యవహరించారు. పోస్టింగులు ఇచ్చారని ఆయన చెప్పినట్లల్లా ఐపీఎస్లు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసినా… టీడీపీ నేతలపై దాడులకు దిగినా.. టీడీపీ ఆఫీసుపై దాడులు చేసినా ..పోలీసులు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఇచ్చేది సజ్జలనే. చివరికి సీబీఐ అధికారులపై కేసు లు పెట్టడం… అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐకే అడ్డుపడటం వంటివి ఐపీఎస్లు చేశారు.
అంతా బాగానే ఉంది.. ఇప్పుడు సజ్జల నాకేం సంబంధం అని తప్పుకుంటున్నారు. ఇప్పుడు బలి అవబోతోంది.. అయింది కూడా సజ్జల చెప్పినట్లుగా చేసిన వాళ్లే.., వాళ్లు తమ చర్యలను సమర్థించుకునే పరిస్థితి లేదు. వారు చేసింది చిన్న చిన్న తప్పులు కాదు. తప్పుడు కేసులు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి… చేయకూడని తప్పులు చేశారు. మాఫియా రాజ్యంలో కీలక నేరగాళ్లుగా మారారు. ఇప్పుడు సజ్జల తప్పించుకుంటున్నారు.. ఆ ఐపీఎస్ల జీవితం మాత్రం బుగ్గిపాలవబోతోంది.