నిజమని నమ్మేవాళ్లుంటే.. మా ఊరి మిరియాలు తాటికాయలంత అని చెప్పేవాళ్లు వైసీపీ ప్రభుత్వంలో లెక్కకు మిక్కిలిగా ఉంటారు. సాక్షికి జర్నలిజం నేర్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు మాట్లాడితే అలాగే ఉంటుంది. తాజాగా ఉద్యోగుల విషయంలో ఆయన చేసిన కామెంట్లు అలాగే ఉన్నాయి. తమకు ఉద్యోగ సంఘ నేతలెవరో కూడా పూర్తిగా తెలియదని.. వారితో పెద్దగా పరిచయం కూడా లేదని… తాము ఉద్యోగులందర్నీ సమానంగా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ..మాజీ ఎన్జీవో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి నియమించారు. ఆ విషయాన్ని సచివాలయంలో ఉద్యోగుల మధ్య ప్రకటించారు.
చంద్రశేఖర్ రెడ్డిని తమపై రుద్దుతున్నారని ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ సంఘ నేతలతో ఆయనకు సరిపడదు. అందుకే సజ్జల కొత్త మాటలు చెప్పుకొచ్చారు. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోబోమని.. కొంత మంది ఉద్యోగ నేతలను చేరదీసి ఉద్యోగుల్ని దూరం పెట్టబోమని అంటున్నారు. తాము అందరికీ దగ్గరేనని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దని.. సమాజంలో అభివృద్ధి సాధించడంలో ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఏదైనా మేము చేయలేకపోతే మా నిస్సహాయత ఉద్యోగులకు చెప్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉద్యోగుల జీతాలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేయలేమని చెప్పడం ద్వారా సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పకనే చెప్పారు . చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులకు అంకితం ఇస్తున్నామని..ఆయనతో పనులు చేయించుకోవాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై బయట మీడియాతో వీరావేశంగా మాట్లాడే బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో మాత్రం సజ్జలకు పొగడటానికి ప్రాధాన్యం ఇచ్చారు. 11వ పీఆర్సీలో మమ్మల్ని చంపి ..కనీసం 12వ పీఆర్సీలో బతికించండని బొప్పరాజు సెటైర్ వేశారు.