జగన్ కుటుంబంలో నిట్ట నిలువగా చిచ్చు పెట్టి.. మళ్లీ కలవకుండా చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన తెలివి తేటలన్నింటినీ వాడేస్తున్నారు. తాజాగా ఆయన షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అనేశారు. తెలంగాణలో పార్టీ పెట్టుకుని.. ఏపీకి వచ్చి పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ సొంత చెల్లిపై పెయిడ్ ఆర్టిస్టు ముద్ర వేయడానికి కూడా సజ్జల వెనుకాడలేదు. ఇంత కాలం ఆయన కుమారుడి నేతృత్వంలోని సోషల్ మీడియా షర్మిల, సునీతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేది ఇప్పుడు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డినే రంగంలోకి దిగారు.
తెలంగాణ నుంచి హఠాత్తుగా షర్మిల ఎందుకు మాయం అయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఎవరిచ్చారన్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్తో కొట్లాడుతానని తెలంగాణలో పార్టీ పెట్టారని.. . ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారన్నారు. మరో నెలలో ప్రజా కోర్టులో ఇదంతా తేలుతుందన్నారు.
కడప లోక్సభ బరిలోకి దిగిన షర్మిల తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని .. వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపిన వ్యక్తి అని.. ఎవరి ఓటు వేయాలో ఆలోచించాలని ప్రజల్ని కోరుతున్నారు. హంతకుల ప్రభుత్వం పోవాలంటే సీఎం జగన్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. వివేకా హత్య అంశం ప్రజల్లోకి వెళ్లేలా జగన్ చెల్లెళ్లు ఇద్దరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ పెద్దల్లో అసహనం పెరిగిపోతోంది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.