ప్రశాంత్ కిషోర్ వదిలేశారు.. ఆయన టీమ్ నుంచి వచ్చిన రిషిసింగ్ నిండా ముంచేశారు. వారు వీరు కాదని.. సాయిదత్ అనే వ్యక్తిని తెచ్చి స్ట్రాటజిస్ట్ అని బోర్డు తగలించారు. కానీ విషయం ఏమిటంటే.. ఆ స్ట్రాటజిస్టుకు కూడా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే. ఆయన చెప్పినట్లే సాయిదత్ చేయాలి. వైసీపీలో ఇప్పుడీ వ్యవహారం కాక రేపుతోంది.
వైసీపీని పాతాళంలోకి తీసుకెళ్లిపోయిన వారిలో ముఖ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని ఎక్కువ మంది చెబుతారు. ఆయన సూచనలు, సలహాలు పార్టీని ముంచేశాయని.. పండిత పుత్ర పరమశుంఠలాగా కుమారుడ్ని తెచ్చి సోషల్ మీడియా టీమ్ ను కూడా నిర్వీర్యం చేశారని ఆయన పై పీకల మీద దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని తగ్గించడానికో మరేమో కానీ.. సాయిదత్ అనే స్ట్రాటజిస్టు మనకు వచ్చాడని ప్రచారం చేశారు. అయితే ఇక సజ్జల సలహాలు ఉండవా అని అందరూ సంతోషపడ్డారు.
కానీ జగన్ రెడ్డి ఇప్పుడు పార్టీ వీడి పోతున్న వారి స్థానంలో కొత్తగా జిల్లాల అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈ సమీక్షలకు సాయిదత్ రిపోర్టులు పంపిస్తున్నారు. ఈ రిపోర్టులన్నీ సజ్జల ప్రిపేర్ చేసేవే. మీకేమీ తెలియదు.. మేము చెప్పినట్లుగా చేయండి అని.. సజ్డల సాయిదత్ టీమ్ ను పూర్తిగా కంట్రోల్ లో పెట్టుకున్నారని అంటున్నారు. ఇక సాయిదత్ అయినా.. సజ్జల అయినా పెద్ద తేడా ఏముందిలే అని పార్టీ నేతలు… చిరాకుపడుతున్నారు. జిల్లా సమావేశాల్లో ఇది బయటపడుతోంది.