పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం కూడా సజ్జల వద్ద లేదు. చివరికి తమ మేనిఫెస్టో అద్భుతమని.. దాన్ని చూసి ఓట్లేస్తారని కూడా ఆయన చెప్పలేరు. ఎందుకంటే అసలు వైసీపీ మేనిఫెస్టోలోఏం లేదు.. వాళ్లే ప్రచారం చేసుకోలేదు.
పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటే.. కనీసం ఓటు వేయడానికి వెళ్లే రోడ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అత్యున్నత పరిపాలన అందించారా అంటే.. ప్రజలు దాడులు చేస్తారనే భయంతో పరదాలు కట్టుకుని తిరిగే పరిపాలన చేశారు. పోనీ పథకాల డబ్బులు అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. గత ఆరు నెలలు ప్రజలకు ఒక్క రూపాయి కూడా పథకాల డబ్బులు ఇవ్వలేదు. అంతేనా.. కాంట్రాక్టర్లకు మాత్రం దోచి పెట్టారు. మరి పాజిటివ్ ఓటు ఎలా వస్తుంది?
పోనీ ప్రజలకు శాంతిభద్రతలపై భరోసా ఇచ్చారా.. వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేస్తాయని .. అందరికీ ప్రశాంతమైన జీవనం హామీ ఇచ్చారా అంటే.. అదీ లేదు. మరి పాజిటివ్ ఓటు ఎలా వస్తుంది ?. తమ వారు డబ్బులు పంచారని.. ఆ డబ్బులు తీసుకుని ఓట్లేస్తారని సజ్జల గట్టి నమ్మకంతో ఉన్నారు. అదొక్కటే ఆయనకు పాజిటివ్.