ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో సమావేశాలుపెట్టి ఏపీలో అరవై లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వాటి తొలగింపుపై దృష్టి పెట్టాలని సూచించారు . పార్టీ నేతలంతా అరవై లక్షల దొంగ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలని పిలుపుస్తున్నారు. ఇప్పటికే ఈ తొలగింపు ప్రారంభించారేమో కానీ వివాదాస్పదం అవుతోంది. వాలంటీర్లతో ఓట్ల తొలగించే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు.
వైసీపీకి ఓటు వేయని వారందరూ దొంగ ఓటర్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి తీర్మానించేసుకుని ఓట్లను తీసేస్తున్నారన్న అనుమానాలు బలంగా ఏర్పడుతున్నాయి. వాలంటీర్ల ద్వారా టీడీపీకి ఓట్లు వేసేవారిని గుర్తించి… తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు. గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఇలాగే ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు వస్తే అధికారులు స్పందించకపోవడంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చారు. దీంతో అప్పటికప్పుడు ఓట్ల తొలగింపు నిజమేనని చెప్పి బీఎల్వోలపై చర్యలు తీసుకున్నారు.
కానీ అలాంటివి రాష్ట్రం మొత్తం చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా .. ఏ బూత్‌లో చూసినా ఇదే పరిస్థితి. ప్రతిపక్షాల ఓట్లు మాత్రమే తొలగిస్తూ వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల సంఘం మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పైకి ఓటరు నమోదు, ఎలాంటి ఎన్నికల విధులనూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఆదేశాలివ్వటమే తప్ప.. గీత దాటుతున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల సమయంలో తమ ఓటు గల్లంతయిందని లక్షల మంది ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చేసే పరిస్థితులు ఉన్నాయి. గత తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇలా ఇరవై లక్షల ఓట్ల వరకూ గల్లంతయ్యాయని..తీరిగ్గా సారీ చెప్పారు అక్కడ ఎన్నికల అధికారి. ఈ సారి ఏపీలో అలా చేస్తారేమో ?.