వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నింటికీ తెగించినట్లుగా ఉన్నారు. ఆయన ప్రధానంగా సజ్జలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సజ్జలతోపాటు ఆయన కుమారుడిపైనా సెటైర్లు వేస్తున్నారు. వైసీపీని ధిక్కరించినప్పటి నుండి కోటంరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను వైసీపీ సోషల్ మీడియా బయట పెడుతోంది. ఆయన చేసిన నేరాలకు అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. సజ్జల కూడా పరోక్షంగా అదే విషయం చెప్పడంతో కోటంరెడ్డికి కోపం నషాళానికి అంటింది. ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ఆయన చెలరేగిపోయారు.
ప్రధానంగా సజ్జలను టార్గెట్ చేసుకున్నారు. ఆయనపై సెటైర్లు వేశారు. అమరికా అధ్యక్షుడికి కూడా సలహాలిచ్చే స్థాయి సజ్జలదని సెటైర్లు వేశారు. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఎక్కడ నుంచి ఊడి పడ్డారని.. సోషల్ మీడియా విభాగంలో పని చేసి.. కేసులు ఎదుర్కొన్నవాళ్లను కాదని.. ఆయనను ఎందుకు ఇంచార్జ్ గా పెట్టారని ప్రశ్నించారు. అరెస్టు చేయడానికి రావాలని సవాల్ చేశారు… దా.. దా .. దా అంటూ ఆయన సజ్జలను కామెడీ చేసే ప్రయత్నం చేశారు.
మరో వైపు తనను రెచ్చగొట్టి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటానన్నారు. తన గొంతు నొక్కాలంటే.. చేయాల్సింది.. ఎన్ కౌంటరేనని.. స్పష్టం చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయాలని సలహా ఇచ్చారు. తాను క్రిస్మస్ రోజున చంద్రబాబునుకలిసినట్లుగా సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ రోజున తాను క్రిస్మస్ వేడుకల్లో ఉన్నానని దానికి వీడియోలు ఉన్నాయన్నారు. నెల కిందటి వరకూ తనకు మరో ఆలోచనలేదని.. తనపై నిఘా పెట్టి తన ఫోన్లు ట్యాప్ చేసినందునే.. విరక్తి చెందానని చెబుతున్నారు. ట్యాపింగ్ పై విచారణ చేయకుండా.. రికార్డింగ్ అని తేల్చడమేమిటని ఆయన ప్రశ్నించారు.
కోటంరెడ్డి సజ్జలను టార్గెట్ చేయడం.. వైసీపీలో చాలా మందికి నచ్చుతోంది. ఆయనకు పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నారు. సజ్జల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయం వైసీపీలో జోరుగా సాగుతోంది.