తమ రాష్ట్రం నుంచి ఓ భారీ పరిశ్రమను వెళ్లిపోవాలని ఏ బాధ్యత ఉన్న ప్రభుత్వ ప్రతినిధి అయినా చెబుతారా..? కొన్ని దశాబ్దాలుగా .. కొన్ని వేల కుటుంబాలకు ఉపాధినిస్తున్న పరిశ్రమని వెళ్లగొడుతున్నామని ఎవరైనా చెబుతారా..?. ఎక్కడైనా చెబుతారో లేదో కానీ ఏపీలో చెబుతారు. అమరరాజా కంపెనీని తామే దండం పెట్టి వెళ్లిపొమ్మని చెబుతున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు .. తామే పంపేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. ఆ పరిశ్రమ పూర్తిగా కాలుష్య కారకమని ఆయన చెబుతున్నారు.
అమరరాజా సంస్థ తమిళనాడులో పెట్టుబడులు పెట్టబోతోందని నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రెస్మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి.. అమరరాజా సంస్థ విషయంపైనా స్పందించారు. అమర రాజా సంస్థ కాలుష్యాన్ని వెద జల్లుతోందని ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తోందని..అది విష తుల్యమైన పరిశ్రమ అని సజ్జల ప్రకటించారు. పొల్యూటెడ్ అయినందునే… దండం పెట్టి తాము.. వెళ్లి పొమ్మని చెబుతున్నామని… కాలుష్యం లేని పరిశ్రమల అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
పుట్టిన జిల్లాకు .. జిల్లా ప్రజలకు ఉపాధి మార్గాలు కల్పించాలన్న లక్ష్యంతో గల్లా రామచంద్రనాయుడు అమెరికా నుంచి వచ్చి చిత్తూరులో బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా దిగ్గజ కంపెనీగా రూపొందించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్లో కీలకనేతగా ఉన్నా పరిశ్రమపై ఎప్పుడూ రాజకీయ నీడ పడనీయలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పరిశ్రమల జోలికి వెళ్లలేదు. కానీ ఏపీలో జగన్ సర్కార్ మాత్రం రాజకీయ కారణాలతో కాలుష్యం అని ఓ సారి నిబంధనల ఉల్లంఘన అని మరోసారి భూములు వెనక్కి తీసుకోవడం.. ప్లాంట్ ను మూసివేయమని ఉత్తర్వులు ఇవ్వడం వంటివి చేస్తోంది. దాంతో అమరరాజా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోంది.