జగనన్నే మన భవిష్యత్ అంటూ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు వైసీపీ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ఇది సాహసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఆయన మీడియాకు వెల్లడించారు. పూర్తిగా ఇది మీ గురించి మాకు తెలుసు.. మాకు ఓటేయకపోతే ఏం జరుగుతుందో గుర్తుంచుకోండి అని హెచ్చరించేలా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.
వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు గుంపుగా ఓ ఇంటి మీదకు వెళ్తారు. జగనన్న పంపారు కాదు కూడదని ముందుగానే గట్టిగా మాట్లాడి.. ఆ తర్వాత చెప్పాలనుకున్నది చెబుతారు. అది సీఎం జగన్ ఇచ్చే సందేశమట. అదేమిటన్నది సజ్జల చెప్పలేదు . ఓ కరపత్రం పంపిణీ చేస్తారు. అందులో గత టీడీపీ పాలన ఎలా ఉంది, ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అనేది ఉంటుందట. గతంలో జన్మభూమి కమిటీలు ఏం చేశాయో చెబుతారట.
ఆ తర్వాత ప్రజా మద్దతు పేరుతో 5 ప్రశ్నలతో సర్వే చేస్తారట. తద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తామని సజ్జల చెప్పుకొచ్చారు. జగనే మా నాయకుడు, ఆయనకే మా ఆశీస్సులు అని భావించినవారు గృహ సారథులు అందించే ఓ ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే మద్దతు తెలిపినట్టవుతుందని సజ్జల చెప్పుకొచ్చారు. మిస్డ్ కాల్ ఇవ్వకపోతే.. వారు తమ వారు కాదని లెక్కేసుకుంటారన్నమాట. మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు జగన్ సందేశం ఐవీఆర్ఎస్ పద్ధతిలో వినిపిస్తుందట.
ఆ తర్వాత స్టిక్కర్లు అంటిస్తారు. ఇంటికి సెల్ ఫోన్లకు కూడా. అయితే అభ్యంతరం లేకపోతేనేనని సజ్జల చెబుతున్నారు. అభ్యంతరం చెప్పి క్షేమంగా ఉండేవాళ్లు ఉంటారా అనేడౌట్ చాలా మందికి ఉంది. ఇలా చేయడాన్ని సాహసమని.. ప్రపంచంలో ఎవరూ చేయలేదని సజ్జల చెబుతున్నారు. అది నిజమే కదా… నేరుగాప్రజల్ని బెదిరించడం.. బ్లాక్ మెయిల్ చేయడం వంటివి ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరని సెటైర్లు వినిపిస్తున్నాయి.