కిందపడినా మాదే పైచేయి అని దులిపేసుకోవడంలో వైసీపీ నేతలను మించిన వాళ్లు లేరు. తాము ఏమి చెప్పినా .. చివరికి కళ్ల ముందు జరిగింది కూడా నమ్మకుండా తాము ఏమి చెబితే అది నమ్మెసే వాళ్లు ఉన్నారని.. దేనికీ తగ్గడం లేదు. వైసీపీకి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంలోనూ వారిది అదే పంథా.
ప్లీనరీలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత జగన్ ను అందరూ కీర్తించారు. ఆయన ఒక్కడు సింహాసనంలో కూర్చుంటే అందరూ కలిసి సన్మానం చేశారు. షిక్కటి చిరునవ్వుతో జగన్ శాశ్వత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రజాస్వామ్యంలో శాశ్వత పదవులు ఉండవని.. ఇదేం పని అని ఈసీ ఘాటుగా లేఖ రాయడంతో వెంటనే మాట మార్చేశారు. ఆ పదవిని జగన్ తిరస్కరించినందున.. ప్లీనరీ మినిట్స్ లోకి ఎక్కించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం మొహమాటం లేకుండా మీడియా ముందు వ్యాఖ్యానించేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరస్కరించారని ..అందు వల్ల ఆ నిర్ణయం మినిట్స్లోకి ఎక్కలేదని చెప్పుకొచ్చారు.ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల తెలిపారు. గతంలో ఇదే సజ్జల.. విజయసాయిరెడ్డి .. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని అడ్డగోలుగా సమర్థించారు. ఇప్పుడు .. తేడా వచ్చే సరికి.. కవర్ చేసుకోవడానికి వాళ్లను నమ్మే ప్రజల్ని అదో రకంగా భావిస్తూ స్టేట్మెంట్లిస్తున్నారు.