సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయం అని సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం వ్యాఖ్యానించి.. ఒక్క రోజు గడవక ముందే నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. తాము అంతర్గతంగా విచారణ జరిపి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశామని గుర్తించామన్నారు. ఆ నలుగురు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ నలుగురిలో ఇద్దరిని వైసీపీ హైకమాండ్ ముందుగానే పరిగణనలోకి తీసుకోలేదు.
కోటంరెడ్డి, ఆనం ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ ఎవరికి ఓటేయాలో చెప్పలేదు. అయితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించి..ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. చివరికి వారు టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లుగా వైసీపీ హైమకమాండ్ గుర్తించింది. తాము ప్రత్యేకంగా ఓ కోడ్ పెట్టుకున్నామని ఆ కోడ్ ఆధారంగా గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాము క్రాస్ ఓటింగ్ చేశామని వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తాము చెప్పిన వారికే ఓటు వేశామని వారు అంటున్నారు.
తనపై సస్పెన్షన్ వేటు వేయడం కరెక్టేనని కోటంరెడ్డి స్పందించారు. ఆయన రిలీఫ్ ఫీలయ్యారు. ఉదయమే ఆయన సోదరుడ్ని టీడీపీలో చేర్పించారు. ఒక వేళ ఈ సస్పెన్షన్ నిన్ననే వేసి ఉంటే ఆయన కూడా ఇవాళే పార్టీలో చేరి ఉండేవారేమో. చర్యలు తీసుకోకుండా నాన్చితే పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతాయన్న అభిప్రాయం వినిపించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు వారు ఇతర పార్టీల్లో ఇబ్బంది లేకుండా చేరవచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు పడదు.