సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ విమర్శల నేపధ్యంలో ఆయనకు మద్దతు పెరగకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి బాహుబలి కలెక్షన్ల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. బాహుబలి సినిమాకి తొలివారం 50 శాతమే టికెట్లు బుక్ అయినట్లు చూపారని అంటున్నారని… బాహుబలి టికెట్ల అంశంపై ఒకసారి చెక్ చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. ఒక వేళ అదే నిజమైతే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు.
బాహుబలికి మొదటి వారంలో సగం టికెట్లే అమ్ముడైనట్టు చూపితే మోసం చేసినట్టే. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. బాహుబలి మొదటి సినిమా 2015లో వచ్చింది.. రెండో భాగం 2017లో వచ్చింది.ఇప్పటికి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆ సినిమా కలెక్షన్ల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం వ్యూహాత్మకంగా బ్లాక్ మెయిల్ చేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మాట్లాడితే అన్ని సినిమాల కలెక్షన్లు బయటకు తీస్తామని అలా జరగకుండా ఉండాలంటే పవన్ కల్యాణ్‌కు మద్దతు చెప్పకుండా ఉడాలన్నట్లుగా సజ్జల ప్రకటన ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతుంది. ధియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసని చెప్పడం ద్వారా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేకుండా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.