ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలకు ఎక్కడా లేనంత పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోరాటం చేయలేరు.. అలాగని తమ ప్రయోజనాల సంగతేమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు సమాధానం చెప్పలేరు. రెండింటిని సమన్వయం చేసుకోవడం వారికి సాధ్యం కావడం లేదు. మూడురోజుల కిందట ఉద్యోగ సంఘం నేతలు విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ సహనం నశిస్తోందని.. పీఆర్సీ సహా తక్షణం ప్రయోజనాలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆ ప్రెస్‌మీట్ ప్రారంభం కాక ముందే ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావుకు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది.
మైక్‌లో ఆన్‌లో ఉండటంతో బండి శ్రీనివాసరావు స్పందన మైక్‌లో రికార్డు అయింది. కంట్రోల్లోనే ఉంటాం సార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్ అంటూ ఆయన కవర్ చేసుకున్నారు. ఫోన్ చేసింది సజ్జల అని పక్కన ఉన్న మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజుకు చెప్పి ఆయనకూ ఫోన్ ఇచ్చారు. ఈ విషయాలన్నీ టీవీల్లో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివరణ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు కానీ తమను బెదిరించలేదని.. శుభాకాంక్షలు చెప్పారని వారు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ఉండొద్దని చెప్పుకొచ్చారు.
సెక్రటేరియట్లో తమ సమస్యలు చెప్పుకోవడానికి జీతాలు, పెన్షన్లు రాలేదని అడగడానికి సెక్రటేరియట్లో ఎవరూ ఉండరని.. తమకు ఒక్క సజ్జల మాత్రమే అందుబాటులో ఉంటారని వారు చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లోనూ ఉద్యోగులను కూడా సంతృప్తి పరిచేందుకు ఉద్యోగ సంఘం నేతలు కొన్ని మాటలు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని.. కొంత మందికి ఇంకా జీతాలు, పెన్షన్లు రాలేదనిన్నారు. ఉద్యోగ సంఘం నేతలు అటు ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఏమవుతుందో అనే భయం.. ప్రశ్నించకపోతే ఉద్యోగులు ఎక్కడ తమపై తిరుగుబాటుచేస్తారోనన్న భయంతో నలిగిపోతున్నారు.