సీబీఐ కొత్త డైరెక్టర్ గా నాగేశ్వరావుని హుటాహుటిన నియమించిన సంగతి తెలిసిందే. అలోక్ వర్మ, రాకేష్ ల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో… ఆ ఇద్దర్నీ ఇంటికి పంపేసి… నాగేశ్వరరావుని నియమించారు. అయితే, ఈ నియామకాన్ని వైకాపా పత్రిక సాక్షి ఎలా చూస్తోందంటే… ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న రహస్య సంబంధానికి మరో ప్రతీక అంటూ ఓ కథనం అచ్చేశారు! సీబీఐ ఛీఫ్ గా నియమితులైన నాగేశ్వరరావుకూ చంద్రబాబు నాయుడుకీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ… ఓ బీరకాయ పీచు లింకేదో పెట్టే ప్రయత్నం చేశారు.
నాగేశ్వరరావుపై ఇప్పటికే కొన్ని ఆరోపణలున్నాయనీ, ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టుగా కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన నియామకంపై ప్రశాంత్ భూషణ్ లాంటివాళ్లు కూడా విమర్శిస్తున్నారనీ, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని తీసుకొచ్చి ఇంత కీలకమైన స్థానంలో ఎలా కూర్చోబెడతారని ప్రశాంత్ భూషణ్ అంటున్నారంటూ రాశారు. దీంతోపాటు, నాగేశ్వరరావు నియామకంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగిపోతోందట..! అదేంటంటే… ఈ నాగేశ్వరరావుకు టీడీపీకి చెందిన కొంతమంది కీలక నాయకులతో స్నేహం ఉందట, టీడీపీలో కొంతమంది నేతలపై కూడా అవినీతి ఆరోపణలున్నాయట, అవి కూడా విచారణ దశలో ఉన్నాయట, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిని దర్యాప్తు సంస్థ ఛీఫ్ గా నియమించడం వెనక మతలబు ఏదో ఉందనే చర్చ ఢిల్లీలో జరుగుతోందట! భాజపాపై టీడీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా… లోపయికారీగా ఆ రెండు పార్టీలూ ఒకటే అని చెప్పడానికి ఈ నియామకం ఒక నిదర్శనం అని రాసేశారు. మరోసారి భాజపాకు చంద్రబాబు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడాలట… అదేంటో మరి!
ఇంకా నయం… అలోక్ వర్మ, రాజేష్ లను తొలగించే ముందు చంద్రబాబుకి మోడీ ఫోన్ చేశారని రాయలేదు! సాక్షి వరుస చూస్తే అలాగే ఉంది. నాగేశ్వరరావు నియామకంతో చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం..? టీడీపీలో ఎవరో కీలక నేతకు నాగేశ్వరరావు తెలిసినంత మాత్రాన… ఏపీ సీఎంకి ఆయన ఎలా అత్యంత సన్నిహితుడు అవుతారు..? సరే, ఒకవేళ సన్నిహితుడే అనుకున్నా… నాగేశ్వరరావును కేంద్రం నియమిస్తే, మధ్యలో చంద్రబాబు ఏం చేస్తారు..? సీబీఐ ఛీప్ గా నాగేశ్వరరావు నియామకాన్ని… భాజపాకు చంద్రబాబు దగ్గరయ్యే ప్రయత్నంగా ఎలా చెప్తారు..? ఈ రెండింటికీ ఉన్న సంబంధమేంటి? ఇంకోటి… ఏపీ విషయంలో అడుగడుగునా కేంద్రం మోకాలడ్డుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే… ఈ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందని సాక్షి ఇంకా చెబుతూ ఉంటే ఏమనుకోవాలి..?