ఆంధ్రప్రదేశ్ లో నిఘా విభాగం అనేదే లేనట్టుగా, అది కేవలం టీడీపీకి అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తోందన్నట్టుగా సాక్షి ఓ కథనం ప్రచురించింది. తెలుగుదేశం పార్టీ సేవలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావు తరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీకి అనుకూలంగా ఎలా వ్యవహరించాలనే అంశంపైనే ఇంటెలిజెన్స్ పనిచేస్తోందనీ, ఆ పార్టీకి ప్రతికూలంగా ఉండేవారిని బెదిరించడం, రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి చంద్రబాబు నాయుడుకి అందించడం చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్రావు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారనీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోందని రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్వేలు చేయించుకుంటున్నారనీ, అలాగే ఆంధ్రాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందా అనే అంశమై కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమై ఉందన్నారు.
మొత్తంగా, ఇదొక టీడీపీ ఇంటెలిజెన్స్ విభాగం అన్నట్టుగా రాసుకొచ్చారు. వాస్తవానికి, అధికారంలో ఉన్నవారి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అధికార పార్టీకి ఈ విషయంలో కొంత అడ్వాంటేజ్ అనేది సహజంగానే ఉంటుంది. అయితే, మరీ టీడీపీ ఏజెన్సీగా మారిపోయిందనీ, ఆ పార్టీ కోసమే పనిచేస్తోందన్నట్టుగా సరైన ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఊహాజనితం! వాస్తవానికి, నిఘా విభాగం అధికార పార్టీకి అత్యంత అనుకూలంగా వ్యవహరించినా రాజకీయంగా దాని ప్రభావం ఏముంటుంది..? వైకాపా అధికారంలోకి రావడం ఖాయం అనేది జగన్ ధీమా కదా, జగన్ ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నది సాక్షి అంచనా కదా. అలాంటప్పుడు, టీడీపీ ఎన్ని విధాలుగా సర్వేలు చేయించుకున్నా, ఎన్ని రకాల నివేదికలు తెప్పించుకున్నా వాటి ప్రభావం ఉండదు కదా!
ఇటీవలే తెరాస నాయకులు చేసిన ఒక ఆరోపణని ఆధారంగా చేసుకుంటూ, గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాదం, తాజాగా విశాఖ మన్యంలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యలకు కారణం నిఘా విభాగం వైఫల్యం అని ఆరోపిస్తూ… ఆ వైఫల్యం వెనక టీడీపీని దోషిగా నిలబెట్టి చూపాలన్న ఒక ప్రయత్నమే ఈ కథనం. నిఘా విభాగంపై సాక్షి ఆందోళన ఎలా ఉందంటే…. టీడీపీకి అవసరమైన సర్వేలు, ఆ పార్టీకి అనుకూలమైన పనుల చేసేస్తోందన్న అక్కసే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే, కేవలం రాజకీయ కోణమే చూస్తున్నారు. అదేదో వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపును ప్రభావితం చేసేస్తుందేమో అనే ఆందోళన సాక్షికి ఉందేమో మరి!