పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగి కొట్టుకుపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను చంద్రబాబు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా ఏ మాత్రం ఆలోచించలేదు. 2003లోనే చంద్రబాబు పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను చంద్రబాబు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కంపెనీకి ఇచ్చేశారని సాక్షి పత్రికలో రాసేశారు. నిజానికి పులిచింతల ప్రాజెక్ట్ అనేదాన్ని కలగన్నది.. కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సాక్షి పత్రిక ఇప్పటికి పదు సార్లు పేజీలకు పేజీల కొద్దీ రాసింది. కృష్ణా డెల్టా దేవుడు వైఎస్ అని కీర్తించింది. అయితే ఒక్క సారిగా ఆ ప్రాజెక్ట్ గేటు ఊడిపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను చంద్రబాబుకు ఇచ్చేయడానికి సాక్షి పత్రిక ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.
కానీ సాక్షి పత్రికలో చెప్పినట్లుగా ఆ ప్రాజెక్ట్ చేసింది బొల్లినేని రామారావు కంపెనీ కాదు. కానీ కంపెనీల పేరుతో కాస్తంత సారుప్యత ఉందని రాసేశారు. ఇక ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన దగ్గర్నుంచి అన్నీ దగ్గరుండి చూసుకుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డినే. 2004లోనే ఆయన శంకుస్థాపన చేసి.. నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశారు. అయితే.. నిర్వాసితులకు పరిహారం మాత్రం ఇటీవలి కాలం వరకూ చెల్లిస్తూనే ఉన్నారు.
గేటు ఊడిపోయింది.. ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందోనని కంగారు పడి సాక్షి పత్రిక.. ముందుగానే టీడీపీ, టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఓ రాయి వేస్తే.. అదే పడి ఉంటుందిలే అన్నట్లుగా వార్తా కథనం వడ్డించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో వైఎస్ హయాంలోనే అన్ని ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ ఏదైనా లోపం బయటపడినప్పుడు మాత్రం అది చంద్రబాబు.. టీడీపీ కట్టించారని చెప్పడం అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.